ఆ సూపర్ స్టార్ 'హోదా' వదిలి రాణిని చూసేందుకు 13 గంటలు క్యూలైన్ లో!

Update: 2022-09-17 06:36 GMT
ఫుట్ బాల్ ఆట గురించి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు 'డేవిడ్ బెక్ హమ్' ఫుట్ బాల్ క్రీడలో అతడికున్న క్రేజ్.. అతనికున్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో క్రికెట్ కు ఎలా పిచ్చెక్కిపోతారో.. పశ్చిమదేశాల్లో ఫుట్ బాల్ గేమ్ కు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటి క్రీడలో సూపర్ స్టార్ హోదా ఉన్న ఇంగ్లండ్ మాజీ ఫుట్ బాల్ స్టార్ తలుచుకుంటే క్వీన్ ఎలిజబెత్ 2ను కడసారి చూసేందుకు నిమిషాల సమయం కూడా పట్టదు.

వీఐపీ హోదాలో ఆయన ఆ పని ఇట్టే చేయొచ్చు. అలా చేస్తే.. ఆయన్ను ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. అంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయి ఉండి.. రాణిని కడసారి చూసేందుకు సామాన్యుడి మాదిరి 13 గంటల పాటు క్యూలైన్ లో వెయిట్ చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. 72 ఏళ్లు ఇంగ్లండ్ ను పాలించిన క్వీన్ కు నివాళులు అర్పించటం కోసం ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు.

ఆమెను సందర్శించుకోవటానికి గంటల కొద్దీ సమయం తీసుకుంటున్నా.. ఓపిగ్గా భరిస్తున్నారు. అలా వెయిట్ చేసిన వారి జాబితాలోడేవిడ్ బెక్ హమ్ కూడా చేరారు. ప్రస్తుతం రాణి భౌతికకాయాన్ని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో ఉంచిన సంగతి తెలిసిందే. నిజానికి డేవిడ్ బెక్ హమ్ కోరుకోవాలే కానీ.. రాణిని నేరుగా వెళ్లి చూసే వీలుంది. కానీ.. అలా చేయకుండా సామాన్యుడిలా ప్రజల్లో కలిసిపోయి.. 13 గంటలు క్యూ లైన్ లో నిలబడి క్వీన్ కు కడసారి నివాళులు అర్పించారు.

ఆయన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే అంశంపై రాయిటర్స్ వార్తా సంస్థ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. 'మనమంతా కలిసి రాణి ఎలిజబెత్ 2ను కడసారి చూసేందుకు వచ్చాం. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవాలనుకున్నాం. ఇలాంటి సమయంలో సెలబ్రిటీ హోదా కంటే కూడా ఒక మామూలు వ్యక్తిగా చూద్దామనుకున్నా..

అందుకే 13 గంటలు పాటు క్యూ లైన్ లో నిలుచున్నా. ఇలా చేసినందుకు నేనేమీ బాధ పడటం లేదు. ఎందుకంటే మనం ఒకరిని కడసారి చూసేందుకు వెళుతున్నాం. అందుకోసం ఎన్ని గంటలు అయినా సరే క్యూలైన్ లో నిలబడే నివాళులు అర్పించాలని అనుకున్నాం' అని పేర్కొన్నారు. ఇప్పటివరకు క్వీన్ ఎలిజబెత్ 2ను 7.5 లక్షల మంది చూశారు. ఆమెను కడసారి చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున పోటెత్తుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News