మేమే ఆదేశిస్తాం : ఏపీ సర్కార్ మీద సుప్రీం కోర్టు ఆగ్రహం

Update: 2022-07-11 13:47 GMT
ఏపీ సర్కార్ ని మేమే ఆదేశిస్తాం అంటూ దేశంలోని అత్యున్నత న్యాయ స్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా నిధులను పీడీ ఖాతాలకు మళ్ళించిన రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తప్పుపట్టింది. ఈ విషయంలో తక్షణం రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి వాటిని జమ చేయాలంటూ ఆదేశించింది.

ఇది నిజంగా అత్యున్నత న్యాయ స్థానం ధర్మాగ్రహమే అంటున్నారు. నిజానికి కరోనాతో మరణించిన వారికి నష్టపరిహారం కోసం నిధులను కేంద్రం విడుదల చేసింది. వాటిని బాధితులకు గుర్తించి పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఏపీలో కూడా పెద్ద ఎత్తున కరోనాతో చనిపోయిన వారు ఉన్నారు.

అయితే ఇలా వచ్చిన నిధులను పీడీ ఖాతాలలోకి రాష్ట్రం మళ్ళించింది అన్న ఆరోపణల మీద దాఖలైన పిటిషన్ మీద సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీం కోర్టుకు బదులిస్తూ ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకుంటామని కోర్టుకు నివేదించారు.

అయితే సుప్రీం కోర్టు న్యాయవాది మాటలను తోసిపుచ్చుతూ ప్రభుత్వం నుంచి సూచనలు కాదు మేమే ఆదేశాలు జారీ చేస్తామంటూ పేర్కొని  ఆదేశించడం విశేషం. ఇక దీని మీద తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే కరోనా సహాయ  నిధుల మళ్ళింపు విషయంలో ప్రభుత్వం ఇరుకునపడిందని అంటున్నారు. ఇప్పటికైనా కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి నిధులను జమ చేయడం ద్వారా అత్యున్నత ధర్మాసనం ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని అంటున్నారు.
Tags:    

Similar News