స‌ర్వే షాకింగ్‌.. అక్క‌డ ప్ర‌తి రెండు గంట‌ల‌కో రేప్‌!

Update: 2022-10-14 05:56 GMT
అస్థిర‌త‌కు, ఉగ్ర మూక‌ల‌కు నిల‌య‌మైన పాకిస్థాన్ మ‌రో అంశంలో అథ:  పాతాళానికి దిగ‌జారింది. పాకిస్థాన్‌లో ప్ర‌తి రెండు గంట‌ల‌కో మ‌హిళ‌పై అత్యాచారం జ‌రుగుతోంద‌ని స‌ర్వే ఒక‌టి బాంబు పేల్చింది. ఈ మేర‌కు ప్రముఖ మీడియా సంస్థ సమా టీవీ పరిశోధన విభాగం జరిపిన సర్వేలో విస్తుపోయే విష‌యాలు వెలుగు చూశాయి.

అంతేకాకుండా పాకిస్థాన్‌లో పరువు హత్యలు సైతం ఎక్కువగానే ఉన్న‌ట్టు స‌ర్వే తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన పంజాబ్‌ హోం, మానవహక్కుల మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల మేరకు.. పాకిస్థాన్‌లో అత్యాచార కేసులు నమోదైన వారిలో 0.2 శాతం మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. శిక్ష‌లు సంఖ్య త‌క్కువ ఉండ‌టంతో కామాంధులు అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. దీంతో మహిళలపై అత్యాచారాల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని స‌మా టీవీ స‌ర్వే షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించింది.

స‌మా టీవీ స‌ర్వే ప్ర‌కారం.. ఒక్క 2017-2021 మధ్య కాలంలోనే పాకిస్థాన్‌లో ఏకంగా 21,900 మంది మహిళలు అత్యాచారాల‌కు గుర‌య్యారు. సరాసరిన రోజుకు 12 మందిపై పాకిస్థాన్‌లో అత్యాచారాలు జ‌రుగుతున్నాయి. ఈ  లెక్కన ఆ దేశంలో ప్ర‌తి రెండు గంటలకు ఒక మ‌హిళ‌పై రేప్ జరుగుతున్నట్లు స‌ర్వే వెల్ల‌డించింది. అయితే ఇవి బ‌య‌ట‌ప‌డిన లెక్క‌లేన‌ని.. ప‌రువు పోతోంద‌ని బ‌య‌ట‌కు చెప్పుకోనివి, పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌ని అత్యాచార ఘ‌ట‌న‌లు ఇంకా ఎన్నో ఉండొచ్చ‌ని స‌మా టీవీ చెబుతోంది.

మ‌రోవైపు ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై పక్షపాత ధోరణితో ప్ర‌వ‌ర్తిస్తున్న‌ 75 దేశాల్లో పాకిస్థాన్‌ అగ్రస్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) 2020లోనే వెల్లడించింది.

కాగా ఈ ఏడాది జూలైలో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 146 దేశాల్లో నిర్వ‌హించిన స‌ర్వేలో స్త్రీ, పురుషు నిష్పత్తిలో పాకిస్థాన్‌ చివరి నుంచి రెండో స్థానంలో అంటే 145వ స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. పాక్‌లో స్త్రీ, పురుషు నిష్పత్తి 56.4 శాతంగా ఉన్నట్లు డబ్ల్యూఈఎఫ్ తేల్చింది. ఈ జాబితాలో పాకిస్థాన్ పొరుగు దేశం అఫ్గానిస్థాన్ చివ‌రి స్థానాన్ని ద‌క్కించుకుంది.

పాకిస్థాన్లో పరువు హత్యలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోవ‌డంతో అగ్రరాజ్యం అమెరికా ప‌లు పలు దేశాలు గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పాకిస్థాన్‌కు సూచిస్తున్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించే త‌మ ప్ర‌జ‌ల‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నాయి. పాకిస్థాన్ మ‌హిళల విష‌యంలో డేంజ‌ర్ జోన్‌లో ఉంద‌నే విష‌యాన్ని పేర్కొంటున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News