పాలసీ డబ్బు కోసం భర్తను చంపించిన భార్య ... వెలుగులోకి సంచలన నిజాలు

Update: 2021-03-04 11:32 GMT
బీమా డబ్బుల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. పక్కా ప్లాన్‌తో హత్య చేసి ఆ తర్వాత తనకేమి తెలియనట్టు నటించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణంలో ప్రధాన పాత్ర పోషించిన బీమా మాయగాళ్ల ముఠా బాగోతం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే..దామరచర్ల మండలం కొండ్రపోలు గ్రామానికి చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి దామరచర్లలోని ఓ మద్యం దుకాణంలో సర్వర్‌ గా పనిచేసేవాడు. రోజులాగే ఫిబ్రవరి 25న కూడా వెళ్లిన ఆయన నార్కట్‌ పల్లి- అద్దంకి హైవేపై బొత్తలపాలెం స్టేజీ వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ట్రాక్టర్‌ ఢీకొనడంతో అతడు మృతిచెందాడని ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో  కోటిరెడ్డి కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బంధుమిత్రులు ఆస్పత్రి వద్దకు చేరుకొని మృతదేహాన్ని చూసి శరీరంపై బలమైన గాయాలు ఉండటాన్ని గమనించారు. ఈవిషయాన్ని కోటిరెడ్డి తల్లి సీతమ్మకు చెప్పారు. తన కుమారుడి పేరిట ఉన్న బీమా పాలసీల క్లెయిమ్‌ డబ్బుల కోసమే హత్యచేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ మొదలుపెట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ తల్లి అనుమానమే నిజమని బహిర్గతమైంది. సాక్షాత్తూ కోటిరెడ్డి భార్యే అతడి హత్య కోసం బీమా ఏజెంటుతో కలిసి కుట్ర పన్ని అతడిని హతమార్చినట్లు గుర్తించారు. బీమా ముఠా వాళ్లు ఇస్తానన్న 25 శాతం క్లెయిమ్‌ డబ్బుల కోసం.. ఆమె తన భర్త ప్రాణాలను ఫణంగా పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు సహా మొత్తం 20 మంది ముఠా సభ్యులను నల్లగొండ పోలీసులు నాలుగు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు.  

మూడేళ్లుగా ఇదే తరహాలో సదరు ఏజెంటు ముఠా ఐదారుగురి ప్రాణాలు తీసి ప్రమాదంగా చిత్రీకరించి బీమా డబ్బులు స్వాహా చేసినట్లు తెలిసింది. దామచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఏజెంట్‌ కోసం గాలిస్తున్నారు. వీరి ఆగడాలను విన్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నారు.
Tags:    

Similar News