గత జన్మలో మజ్లిస్ అసద్.. ‘నకులుడు’.. సంఘ్ చీఫ్ ‘శకుని’

Update: 2021-10-12 04:01 GMT
ప్రభుత్వ ఉద్యోగి ఒకరి మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఆదివారం తనకు సెలవు ఇవ్వాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఒక లేఖ రాశారు. ఉద్యోగులు సెలవుల్ని అడగటం.. దానిపై ఏదో ఒక చర్చ జరగటం మామూలే. కానీ.. ఈ ప్రభుత్వ ఉద్యోగి సెలవు కోసం రాసిన లేఖ సమ్ థింగ్ డిపరెంట్ అని చెప్పక తప్పదు. ఇటీవల కాలంలో ఎవరూ ప్రస్తావించని అంశాల్ని ప్రస్తావించటం ద్వారా సెలవు విషయం పక్కకు వెళ్లి.. ఆయన రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదివినంతనే ఆసక్తికరంగా ఉన్న ఈ లేఖను చూసిన ఉన్నతాధికారులు సైతం విస్తుపోవటం గమనార్హం.

ఇంతకీ ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరు? సెలవు కోసం ఆయన రాసిన లేఖలో ఏముంది? అన్న విషయాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కు చెందిన ఒక ప్రభుత్వ విభాగానికి చెందిన ఇంజినీర్ ఒకరు తన ఉన్నతాధికారులకు లేఖ రాశారు. తనకు ప్రతి ఆదివారం సెలవు కావాలని కోరారు. ఇందుకోసం పెట్టుకున్న అప్లికేషన్ లో ఆయన విచిత్రమైన అంశాల్ని ప్రస్తావించారు. మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లాలోని సంశేఱ్ జనపద్ పంచాయితీకి పెద్ద మనిషికి సబ్ ఇంజినీర్ రాజ్ కుమార్ యాదవ్ రాసినలేఖలో తనకు కొద్ది రోజుల క్రితమే తన గత జన్మ గురించిన వివరాలు తెలిశాయన్నారు.

తన జీవిత రహస్యాన్ని కనుగొనటానికి.. ఆత్మను శోధించేందుకు ఉపయోగపడేలా తనకు ప్రతి ఆదివారం సెలవు మంజూరు చేయాలని కోరారు. అంతేకాదు.. తన గత జన్మలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చాలా మంచి మిత్రుడని.. అతను పాండవుల్లో ఒకరైన నకులుడిగా చెప్పారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా వ్యవహరిస్తున్న మోహన్ భగవత్ కూడా తెలుసన్నారు.

గత జన్మలో మోహన్ భగవత్.. శకుని అని తెలిపారు. తన గత జన్మ గురించి తెలిసిన తర్వాత.. ఇకపై తన జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నానని.. శాశ్వతమైన ఆత్మ కోసం శోధించాలని తాను అనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. అన్నీ అర్థమై.. గత జన్మ రహస్యలు కూడా తెలిసిన పోయిన తర్వాత.. తుచ్చమైన ఆదివారం సెలవు లాంటివి అవసరమా? మరి.. ఈ అధికారి రాసిన లేఖకు ఏమని బదులిచ్చారో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆయన లేఖ తెగ వైరల్ గా మారింది.




Tags:    

Similar News