హుజూరాబాద్‌లో వీళ్ల పోటీ వేరు!

Update: 2021-10-21 09:39 GMT
అటు అధికార టీఆర్ఎస్‌.. ఇటు బీజేపీ త‌ర‌పున మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మ‌ధ్య పోరుతో హుజూరాబాద్ ఉప ఎన్నిక కాక పుట్టిస్తోంది. పోలింగ్‌కు మ‌రికొన్ని రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో విజ‌యం కోసం పార్టీల‌న్నీ త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మరం చేశాయి. ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇలా ఉప ఎన్నిక‌లో పోటీప‌డే అభ్య‌ర్థుల మ‌ధ్య పోటీ ఉంటే.. మ‌రోవైపు ఒకే పార్టీలో ఉన్న ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఆ నాయ‌కులే టీఆర్ఎస్‌కు చెందిన కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్‌.. అందుకు అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వ్యూహాలు స‌మ‌ర్థంగా అమ‌లు చేస్తున్నారు. అందులో భాగంగానే నియోజ‌క‌వ‌ర్గంలోని రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డిని, బీజేపీ నుంచి పెద్దిరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన దాదాపు 24 వేల ఓట్లు పొందేందుకు రంగం సిద్ధం చేశారు. కౌశిక్‌ను గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీని చేసేందుకు అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. కానీ అది ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర పెండింగ్‌లో ఉంది.

మ‌రోవైపు హుజూరాబాద్‌పై పెద్ది రెడ్డి ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇక్క‌డ బీజేపీ త‌ర‌పున పోటీ చేయాల‌నుకున్నారు. కానీ ఈట‌ల బీజేపీలో చేర‌డంతో ఆయ‌న‌కు అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో గులాబి గూటికి చేరారు. ఇప్పుడీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ విజ‌యం సాధిస్తేనే పెద్దిరెడ్డి ఏదైనా ప‌ద‌వి ద‌క్కే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో ఇటు పెద్దిరెడ్డి అటు కౌశిక్ రెడ్డి త‌మ బ‌లాన్ని నిరూపించుకునేందుకు పోటీ ప‌డుతున్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గంతో పాటు త‌మ వెంటే ఉన్న క్యాడ‌ర్‌ను కూడా కారు పార్టీ వైపు తిప్పుతున్నారు. ఈ ఆధిప‌త్య పోరు కార‌ణంగా వీళ్లిద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తుతున్నాయ‌నే టాక్ ఉంది.

పార్టీలో చేరిక‌ల స‌మ‌యంలో త‌మ వ‌ర్గం అంటే త‌మ వ‌ర్గం అని ఈ నాయ‌కులిద్ద‌రూ పోటీ ప‌డుతున్నారు. తామే ఎక్కువ మందిని పార్టీలో చేర్పించామ‌ని కేసీఆర్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి త‌న స‌త్తా ఏంటో చాటాల‌నుకుంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ త‌ర‌పున గెల్లు శ్రీనివాస్ ఒక‌వేళ గెలిచినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో పెద్దిరెడ్డి ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి టీఆర్ఎస్‌లో ఈ ఇద్ద‌రు రెడ్డి నాయ‌కుల భ‌విత‌వ్యం ఏమిట‌న‌దే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం త‌ర్వాత తేల‌నుంది.
Tags:    

Similar News