ఉన్నది 6 మ్యాచ్ లే.. ప్రయోగాలకు టైం లేదు: హార్దిక్

Update: 2023-01-03 11:02 GMT
యువ ఓపెనర్లు.. డాషింగ్ వన్ డౌన్ బ్యాట్స్ మన్.. కొత్త కెప్టెన్ (పూర్తి స్థాయి).. చురుకైన కుర్ర పేసర్లు.. ఇద్దరు ముగ్గురు ఆల్ రౌండర్లు.. వినేందుకే ముచ్చేటేసే క్రికెట్ జట్టు కూర్పు ఇది.. ఇంత బాగా కుదరాలంటే అంతా కలిసిరావాలి. అయితే, ప్రస్తుతం టీమిండియాకు అలానే కలిసొచ్చింది. ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా సారథ్యంలో మంగళవారం నుంచి శ్రీలంకతో తలపడనున్న టీమిండియా చక్కగా కనిపిస్తోంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ లో యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య నేతృత్వం వహిస్తున్నాడు.  ఆసియా కప్‌ సమయంలో లంకేయుల చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే.

దీంతో తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులను ఈ  సిరీస్‌తోనైనా అలరిస్తారా? అనే ప్రశ్నకు కెప్టెన్‌ పాండ్య స్పందించాడు. ప్రతీకారం కాదు.. ప్రదర్శన ఆసియా కప్ లో శ్రీలంక టీమిండియాను దెబ్బకొట్టింది. అనంతరం టి20 ప్రపంచ కప్ లో మెరుగ్గానే రాణించినా, లీగ్ దశలోనే వెనురిగింది. కానీ, ఏడాది కిందటితో పోలిస్తే లంక చాలా మారింది. పరిస్థితులకు తగ్గట్లు ఆడే కుర్రాళ్లతో మెరుపులు మెరిపిస్తోంది.

ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లి, రాహుల్, జడేజా, బుమ్రా వంటి సీనియర్లు లేని టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిందే. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ లో అదరగొడితే.. సూర్య, హార్దిక్, సంజూ దానిని కొనసాగిస్తారు.

చివర్లో దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. కాగా, పేసర్లు అర్షదీప్, ఉమ్రాన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అర్ష ఎడమచేతివాటం వైవిధ్యం తెస్తోంది.అవసరమైతే 140 కి.మీ. పైగా వేగంతో బంతులేయగల అతడు జట్టుకు ఆరంభ ఓవర్లలో వికెట్ అందించగలడు. కశ్మీర్ పేస్ గుర్రం ఉమ్రాన్ గురించి చెప్పేదేముంది? అతడి వేగానికి కచ్చితత్వం తోడైతే వికెట్ల పండుగే. వీటన్నిటి రీత్యా లంకపై ప్రతీకారం తీర్చుకుంటారా? అని హార్దిక్ ను ప్రశ్నించగా.. అతడు భిన్నంగా స్పందించాడు.

ఉన్నవి 6 గేమ్ లే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగింట టీమిండియాకు మిగిలినవి ఆరు టి20 మ్యాచ్ లే. ఈ నేపథ్యంలో తన సారథ్యంలో జట్టు ఏ విధంగా ముందుకు వెళ్లనుందనే పాండ్య వివరించాడు. ''ఐపీఎల్ ముంగిట కేవలం ఆరు గేమ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రయోగాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదు. అయినప్పటికీ కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకువెళ్తాం. అందులో ఏది మంచి ఫలితాలను ఇస్తుందో చూస్తాం.

జట్టులో అందరికీ వీలైనన్ని ఎక్కువ అవకాశాలు అందేలా చూస్తాం''అంటూ వివరించాడు.  'బదులు తీర్చుకునేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని మేం అనుకోవడం లేదు. కానీ, గొప్ప ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తాం. ప్రత్యర్థి జట్టును జడిపించడానికి కొత్తగా చేయాల్సిందేమీ లేదు. వారికి మా బాడీ లాంగ్వేజ్‌ చాలు. భారత్‌లో టీమ్‌ఇండియాను ఢీకొడుతున్నారన్న విషయాన్ని గుర్తుచేసేలా ఆడతాం. గత వైఫల్యాలను నా కెప్టెన్సీలో పునరావృతం కాకుండా చూసుకుంటాను'' అని పాండ్య పేర్కొన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News