మనుషుల్లో మానవత్వం ఏమైపోయింది .. ఒక్కసారి ఆలోచించండి !

Update: 2020-08-16 00:30 GMT
మానవత్వం ..ఇదెక్కడో విన్నట్టు ఉందే ఈ పదాన్ని అని అనిపిస్తుందా ? తప్పేమి లేదు ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే .. అప్పట్లో ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితం వల్ల ఎలా అయితే స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకుంటున్నామో ..అదే విధంగా అప్పటి మనుషుల్లో మానవత్వం అనేది ఉన్నదట అని చెప్పుకోవాల్సిందే. ఇప్పటికే చాలామందిలో మానవత్వం అనేది మచ్చుకైనా లేదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో జన జీవనంలోకి అడుగుపెట్టిన కరోనా మహమ్మారి మానవత్వాన్ని పూర్తిగా మట్టుబెట్టింది. కనీసం రోడ్డులో రక్తం కారుతూ నిస్సహాయత స్థితిలో ఉన్నా కూడా చూసి చూడనట్టు వెళ్లి పోయే పరిస్థితి లో మనం జీవిస్తున్నందుకు సిగ్గు పడాలి.

సాటి మనిషి చనిపోతే సహాయం చేయాల్సిన సమయంలో కొందరు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని కనీసం వారి కంట తడి తుడిచేదానికి ప్రయత్నించాలి కానీ , వారిని మరింత కష్టాల ఊబిలో తోసేయకూడదు. అద్దె ఇళ్లలో ఉన్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే మృతదేహాలను ఇంటికి తీసుకురావడానికి కూడా నిరాకరిస్తున్నారు. దీంతో కష్టకాలంలో మృతుల కుటుంబాలు రోడ్డు మీదకు చేరుతున్నాయి. తాజాగా అసలు మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటన ఒకటి జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

చెన్నూర్‌ మండలంలోని జజ్జరెల్లి గ్రామానికి చెందిన దొంతల సత్యం అనే వ్యక్తి చెన్నూర్‌ పట్టణానికి జీవన సాగించడానికి వలస వచ్చాడు. చెన్నూర్‌ లో కూలీ పని చేసుకుంటూ అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు. సత్యం కుమారుడు దొంతల వినోద్‌ అనారోగ్యానికి గురికాగా వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ బుధవారం రాత్రి మృతి చెందాడు. అయితే, వినోద్‌ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇంటి యాజమాని ఒప్పుకోలేదు. దీంతో గోదావరి నది వద్దే కుటుంబసభ్యులు వానలో తడుస్తూ వినోద్ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు సత్యం కుటంబానికి ఆసరాగా నిలిచారు. దశదిన కర్మ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. ఇదొక్కటే ఇలాంటి ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి.

ముఖ్యంగా పట్టణాల్లో కానీ , నగరాల్లో కానీ సగానికి పైగా జనాభా అద్దె ఇళ్లల్లో ఉంటారు. సొంత ఊర్లో చేయడానికి పనిలేక , అక్కడే ఉంటే ఆకలితో చావాల్సిందే అని భావించి నగరాలకు , పట్టణాలకు వచ్చి ఎదో ఒక పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. అద్దె ఇళ్లలో ఉంటున్న సమయంలో వారు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలంటే అడ్డు చెప్పకుండా , ఆపద సమయంలో ఉన్నప్పుడు కనీసం మానవత్వం మరచి పోతున్నారు. కొందరు చనిపోతే శవాలని ఇంటి ముందుకు కూడా రానివ్వడం లేదు. వీలైతే కష్టాల్లో ఉన్న వారికీ సహాయంగా నిలవండి కానీ ,వారికీ మరింత సమస్యగా మారకండి.


Tags:    

Similar News