కర్నూలు జిల్లా టూర్ లో ఫైరింగ్ మాటలతో బాబు.. కొత్త యాంగిల్ చూపారుగా?

Update: 2022-11-17 04:29 GMT
మూడు రోజుల కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. ఈసారి తన పర్యటనలో తనలోని కొత్త యాంగిల్ ను చూపించారు. పలు వేదికల మీద మాట్లాడిన ఆయన.. మంట పుట్టేలా మాట్లాడిన వైనం ఆసక్తికరంగా మారింది.

చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేస్తూ.. ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు.

అంతేకాదు.. జగన్మోహన్ రెడ్డి పాలనలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. రాష్ట్రానికి జరుగుతున్న నష్టాలను ఏకరువు పెట్టిన ఆయన.. తనను అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ కార్యకర్తలు.. మద్దతుదారులపైనా నిప్పులు చెరిగారు.

ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబు కాలేజీ విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతో పాటు.. పలు వ్యాఖ్యలు చేశారు. అనంతరం కర్నూలు.. కోడుమూరు.. దేవనకొండ వద్ద రోడ్ షో నిర్వహిస్తూ.. రాత్రి వేళకు పత్తికొండకు చేరుకున్నారు.

అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు నోటి నుంచి వచ్చిన పవర్ ఫుల్ వ్యాఖ్యల్ని చూస్తే..

-  జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపితే తప్ప ఈ రాష్ట్రానికి.. ప్రజలకు మోక్షం లేదు. గడప గడపకూ వస్తారు వైసీపీ దొంగలు. నాలుగుసార్లు తిరిగితే అన్నీ మరిచిపోయి ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం మర్చిపోతామా? రాష్ట్రంలో లక్షల రేషన్ కార్డుల్ని తొలగించారు. పేదవాళ్ల పొట్టకొట్టటంలోజగన్ రెడ్డి ఘనుడు. ప్రజల ఆకలి మంటలే ఆయనకు శాపంగా మారతాయి.
-  నేను అసెంబ్లీకి పోవాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించక తప్పదు. లేనిపక్షంలో నేను అసెంబ్లీకి వెళ్లలేను.
-  నేను అధికారంలోకి వస్తే సంక్షేమం ఉండదని కొందరు దుష్ప్రచరాం చేస్తున్నారని.. కానీ ఇప్పటికంటే మెరుగైన సంక్షేమ పథకాల్ని అమలు చేసి చూపిస్తా.
-  నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నన్ను ఎవరూ అవమానించే సాహసం చేయలేదు. కానీ.. ఇప్పుడు అసెంబ్లీలో నన్ను.. నా సతీమణిని అవమానించారు. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నా. అది గౌరవ సభ కాదు.. కౌరవ సభ. మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ఆ రోజే చెప్పా. నేను అసెంబ్లీకి పోవాలంటే రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రేపు జరిగే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నా.
-  జగన్‌ రాయలసీమ ద్రోహి. ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. దాని గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. సీమను అభివృద్ధి చేసింది టీడీపీయే. రాయలసీమ జిల్లాల్లో ఒక ప్రాజెక్టయినా పూర్తి చేశావా? రాయలసీమ లిఫ్టు అంటూ గొప్పలు చెప్పారు. ఇప్పుడేమైంది..?
-  మేం అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమకు అన్ని ప్రాజెక్టులూ చేపట్టాం. హంద్రీ-నీవాకు రూ.5,500 కోట్లు ఖర్చు చేశాం. గాలేరు-నగరికి రూ.2,500 కోట్లు వెచ్చించాం. పత్తికొండ, ఆలూరు నియోజవకర్గాల్లో ప్రతి పల్లెకు నీళ్లు ఇవ్వాలని 68 చెరువుల లిఫ్టు చేపట్టాం. వేదవతి ప్రాజెక్టు తీసుకువచ్చాం. గుండ్రేవుల ప్రాజెక్టును మంజూరు చేశాం. అవన్నీ ఏమయ్యాయి?
-  కడపలో స్టీల్‌ ప్లాంటు నిర్మించలేని ఈ పెద్ద మనిషి మూడు రాజధానులు నిర్మిస్తారంటే నమ్మాలా? కర్నూలులో హైకోర్టుకు నేను అడ్డుపడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. నేను అడ్డుపడడం లేదు. మీకు 151 సీట్లు ఇచ్చారు. ఎంపీలను ఇచ్చారు. మీ కేసుల కోసం ముగ్గురు ఎంపీలను అమ్ముకున్నావు. నువ్వు చేసిందేమిటి?
-  హైదరాబాద్ ను బాగు చేశా. రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది వయసు అయిపోయిందని ఎగతాళి చేస్తున్నారు. నేను చెప్పా.. నాకంటే వయసు అయిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. నాదీ.. నరేంద్ర మోడీదీ ఒకటే వయసు. 70 ఏళ్లకు బైడెన్ అమెరికా అధ్యక్షులు అయ్యారు. నేను శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నా. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్లకుఅప్పగిస్తాను తప్ప.. నేను మీ పేటీఎం బ్యాచ్ కు వదిలిపెట్టనని స్పష్టంగా చెప్పా. అందుకే అడుగుతున్నా.. ప్రజలారా నన్ను ఆశీర్వదించండి.
-  ఆనాడు బాబాయిని చంపి.. నారాసుర రక్త చరిత్ర అని వాళ్ల పేపరులో రాశారు. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వం వచ్చాక నిందితులను ఎందుకు పట్టుకోలేదు?
-  తండ్రిని చంపిన హంతకులను శిక్ష పడాలని వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు.  ఈ రాష్ట్రంలో తనకు న్యాయం జరగదని.. కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పోరాటం చేస్తున్నారు. ఆమెకు మనమంతా అండగా ఉందాం.
-  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలు పెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మీరే ఆలోచించండి. ఎన్నికల్లో జగన్ ను చిత్తుచిత్తుగా ఓడించి కోలుకోలేకుండా చేస్తా.
-  పవన్ కల్యాణ్ సభకు స్థలం ఇచ్చారన్న కోపం పెట్టుకొని రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లన్నీ పడగొట్టారు. ఎంత కొవ్వెక్కితే ఇలాంటి చేష్టలు చేస్తారు. చట్టాన్ని గౌరవించాలి. నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డుపై తిరిగేవారా?
-  ఇదే జగన్ నంద్యాల ఉప ఎన్నికల సమయంలో నన్ను నడిరోడ్డులో కాల్చేయాలని.. ఉరి తీయాలని అన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ విశాఖకు వెళితే పెద్ద సీన్ చేశారు. నేను ఆయన్ను విజయవాడలో కలిసి సంఘీభావం తెలిపి.. అందరం కలిసి పోరాడదాం.. ప్రజాస్వామ్యం కోసమని చెబితే నన్ను విమర్శిస్తున్నారు. అందరినీ కలుపుకొని వస్తాం. ఓట్లు వేయటం మీ ఇష్టం. కానీ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సీనియర్ నాయకుడిగా నా బాధ్యత.
-  తల్లి.. చెల్లిని చూడనివాళ్ల గురించి ఏం మాట్లాడతాం. నా మీటింగ్ కు వచ్చి డిస్ట్రబ్ చేస్తారా? తన వాళ్లనుపంపి నన్ను వెనక్కి వెళ్లమంటున్నారు. కోడిగుడ్లు వేస్తే.. ప్లకార్డులు ప్రదర్శిస్తే భయపడిపోతానా? మీ నాన్నను.. తాతను.. ముత్తాతను చూశా. నా దగ్గర తోక తప్పితే కట్ చేస్తాం తప్పించి భయపడేది లేదు.
-  ప్రత్తికొండ ఎమ్మెల్యే.. కొడుకు.. వియ్యంకుడు.. మరిదికి ఒక్కోపోర్టుఫోలియో చొప్పున ఇసుక.. మద్యం.. భూకబ్జాలు పంచేశారు. నాపైనే రౌడీయిజానికి వస్తారా? ఇలాంటోళ్లను చాలామందినే చూశా.
-  జగన్‌కు సవాల్‌ చేస్తున్నా.. రాయలసీమకు ఒక్క పరిశ్రమైనా తెచ్చావా? టీడీపీ అధికారంలో ఉండగా.. ప్రపంచ దేశాలు తిరిగి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.
-  రాయలసీమలో నీళ్లు లేని ప్రాంతం అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తెచ్చిన ఘనత మాదే. నేను ఫిట్‌గా ఉన్నా. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదు. మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డువేసి కాపాడుకుంటా.. వైసీపీ గూండాలకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలు ఓట్లు వేస్తే.. ఖజానాను సాక్షికి తాకట్టు పెడతారా? సాక్షిలో పని చేసే గుమాస్తాలను ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు. ఆ పేపరు పెద్ద గుమాస్తా సజ్జల సకల శాఖ మంత్రి.
-  మద్యం డిస్టిలరీలన్నీ ఆయనవే. పంపిణీ ఆయనదే. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆయన బ్రాండ్లే అమ్ముతున్నారు. సాయంత్రం అయితే చాలు.. బటన్‌ నొక్కితే డబ్బులన్నీ ఆయనకే చేరిపోతాయి. వైసీపీ ఎమ్మెల్యేలు పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముతున్నారు. ఇటీవల ఢిల్లీలో మద్యం స్కాంలో దాడులు చేశారు. ఇక్కడ ఎప్పుడు చేస్తారో!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News