ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇవే

Update: 2021-03-29 08:03 GMT
కరోనా కల్లోలంతో ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రెండో ఏడాది కూడా పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆర్డినెన్స్ ద్వారా ఇటీవలే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించారు. తిరుపతి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం.. ఎన్నికల కోడ్ ఉండడంతో మూడు నెలలకు దాదాపు 70 వేల కోట్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించారు. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రధానంగా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. సంక్షేమం తర్వాత వ్యవసాయం, విద్యారంగాలకు భారీగా కేటాయింపులు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు నెలలకు మొత్తం రూ. 70,983.11 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ హరిచందన్ ఆమోదించారు.

సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజనులు, మైనార్టీల సంక్షేమం, స్త్రీ , శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమానికి కలిపి మొత్తం రూ.10వేల కోట్లకు పైగా దక్కింది.

సంక్షేమ తర్వాతి స్థానంలో ఉన్న వ్యవసాయరంగానికి రెవెన్యూ కింద  రూ.7,171.36 కోట్లు, పెట్టుబడి వ్యయం కింద రూ.167.64 కోట్లు కేటాయించారు.  రైతు భరోసా నిధుల కోసం ఈ స్థాయిలో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది.

విద్యారంగానికి రూ.7972 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యాకానుక, నాడు-నేడు పథకాల కోసం విద్యారంగానికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది.

ఇక సాగునీటి నిర్మాణం కోసం రూ.2వేల కోట్లు కేటాయించారు. మొత్తంగా నీటి పారుదలశాఖకు రూ.2653 కోట్లు కేటాయించారు. వైద్యఆరోగ్యశాఖకు రూ.3567 కోట్లు కేటాయించారు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.7955.66 కోట్లతో అనుబంధ పద్దుకు కూడా ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. 
Tags:    

Similar News