ఈ ముగ్గురే మ‌హారాష్ట్ర రాజ‌కీయం మార్చిన మ‌హిళ‌లు

Update: 2019-11-27 01:30 GMT
హాలీవుడ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను మించిన రాజకీయంతో సాగుతున్న మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌కు తాత్కాలిక ఫుల్ స్టాప్ (!) ప‌డింది. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ... ఏర్ప‌డిన బీజేపీ, శివ‌సేన చీలిక వ‌ర్గం స‌ర్కారు కుప్ప‌కూలింది. ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. దీంతో శివ‌సేన అధినేత ఉద్ద‌వ్ ఠాక్రేకు సీఎం పీఠం ఎక్కే అవ‌కాశాలు ప్ర‌స్పుటంగా క‌నిపిస్తున్నాయి. సంచ‌ల‌న ఈ ప‌రిణామాల్లో ముగ్గురు మ‌హిళ‌లు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా పార్టీ ర‌థ‌సార‌థి ఉద్ద‌వ్ ఠాక్రే త‌న‌యుడు ఆదిత్య ఠాక్రే  పోటీలో దిగారు. బీజేపీకి తోక‌పార్టీలా ఉండ‌టం కంటే గోదాలోకి దిగి తేల్చుకోవ‌డం అనే ఎజెండాతో  ఆయ‌న్ను ఉద్ద‌వ్ స‌తీమ‌ణి పోటీకి దించిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా, బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే చెరో రెడున్నరేళ్లు ప‌ద‌వీకాలం పంచుకోవాల‌ని ఆమె ష‌ర‌తు పెట్టార‌ట‌. ఆ ష‌ర‌తు న‌చ్చ‌కే...బీజేపీ త‌న‌దారి తాను చూసుకొని..ప్ర‌స్తుత స‌ర్కారును ఏర్పాటు చేసి అప‌హాస్యం పాలైన సంగ‌తి తెలిసిందే.

ఇక మ‌రో మ‌హిళ సంచ‌ల‌న రీతిలో పార్టీకి షాకిచ్చి బీజేపీకి మ‌ద్ద‌తిచ్చి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి పొంది...అంతే అనూహ్యంగా రాజీనామా చేసిన అజిత్ ప‌వార్ పిన్ని, ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ స‌తీమ‌ణి ప్ర‌తిభ‌. అజిత్ తిరుగుబాటు నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మార‌డం, శ‌ర‌ద్ పవార్ ప్ర‌భ మ‌స‌క‌బారుతున్న త‌రుణంలో ప్ర‌తిభ ఎంట‌ర‌య్యారు. అజిత్ వ‌ద్ద‌కు వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపారు. పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌గా తొల‌గించినంత మాత్రాన దూరం పెట్టిన‌ట్లు కాద‌ని...ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌నందున‌...బీజేపీతో సంబంధాలు తెగ‌దెంపులు చేసుకుంటే...పార్టీలో క‌లిసి ప‌నిచేసుకోవ‌చ్చున‌ని సూచించారు. దీంతో అజిత్ వెన‌క్కు త‌గ్గారు. డిప్యూటీ సీఎం ప‌ద‌వికి టాటా చెప్పారు. త‌ద్వారా బీజేపీ స‌ర్కారును కుప్ప‌కూల్చారు.

మ‌రో ముఖ్య‌మ‌హిళ , ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కూతురు సుప్రియా సూలే. అజిత్ బీజేపీకి మ‌ద్ద‌తివ్వ‌డం, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌రుణంలో త‌న తండ్రి శ‌ర‌ద్ ప‌వార్‌పై మ‌రో ర‌కంగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో..ఆమె రంగంలోకి దిగి ఆ ప‌రిణామాల‌ను దూరం చేశారు. త‌న వాట్సాప్ స్టేట‌స్‌ల ద్వారానే...ఆమె విష‌యాల‌ను స్ప‌ష్టంగా తెలియ‌జేశారు. 'కుటుంబంలో పార్టీలో చీలిక వ‌చ్చింది'అని తొలి రోజు  వాట్సాప్‌ స్టేటస్ పెట్టిన సుప్రియా సూలే... దానికి కొన‌సాగింపుగా మ‌రుస‌టి రోజు  ఉదయం తన వాట్సాప్‌ స్టేటస్‌లో రెండు అంశాలు ప్ర‌స్తావించారు  'గుడ్‌ మార్నింగ్‌. ఎప్పటికైనా విలువలే గెలుస్తాయి. నిజాయితీ, కష్టం వృధాగా పోవు. నిజాయితీతో పనిచేయడం కొంచెం కష్టమైనా..దాని ఫలితాలు ఎక్కువ కాలం ఉంటాయని' అప్‌డేట్‌ పెట్టారు. 'అధికారం వస్తుంటుంది..పోతుంటుందని నేను నమ్ముతా. కానీ వాటికన్నా బంధాలు చాలా ముఖ్యమైనవి' అని ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చారు. ఇలా ముగ్గురు మ‌హిళ‌లు...ఈ ఉత్కంఠ భ‌రిత రాజ‌కీయాల్లో త‌మ వంతు పాత్ర పోషించార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News