మోడీతో పవన్‌ ప్రస్తావించిన అంశాలివే!

Update: 2022-11-12 04:32 GMT
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో అందరి కంటే ముందుగా జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి విశాఖకు చేరుకున్న మోడీ ఆ వెంటనే తాను బస చేసిన ఐఎన్‌ఎస్‌ చోళలో పవన్‌ను కలిశారు.

దాదాపు 35 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో ఏకాంతంగా పవన్‌ మోడీతో మాట్లాడినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, మూడు రాజధానుల పేరుతో వైసీపీ చేస్తున్న చిల్లర పనులు, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుపాళ్లు చేయడం, పోలీసులను, సీఐడీని వాడుకుంటూ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరినీ కొట్టించడం, తిట్టించడం చేస్తున్నారని పవన్‌.. నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. లెక్కకు మిక్కిలిగా ఉచిత పథకాల పేరుతో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నారని మోడీ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది.

అదేవిధంగా వైసీపీకి ప్రజాస్వామ్య విలువల పట్ల ఏమాత్రం గౌరవం లేదని పవన్‌ మోడీకి వివరించారని సమాచారం. ఇటీవల విశాఖ పర్యటనలో పోలీసులు తన పట్ల చేసిన అతి, తమ పార్టీ నేతలను అర్ధరాత్రి హోటల్‌ రూమ్‌లో చొరబడి అరెస్టు చేయడం, హత్య కేసులు నమోదు చేయడం వంటివి చేశారని ప్రధానికి పవన్‌ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

అలాగే ఇప్పటంలో తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ప్రజల ఇళ్లను కూల్చివేసిన విషయాన్ని కూడా పవన్‌ మోడీ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.

అలాగే తమ రెండు పార్టీలు కలసి పనిచేయడానికి తగ్గ వాతావరణం లేదని.. రోడ్‌ మ్యాప్‌ అడిగితే ఇంతవరకు స్పందించలేదని ఆయనకు పవన్‌ గుర్తు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నేతల వ్యవహార శైలిపై పవన్‌ మోడీ వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ప్రధాని మోదీతో భేటీ ముగిసిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని విశాఖ పర్యటనను పురస్కరించుకుని రెండు రోజుల కిందటే తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందన్నారు. విశాఖ పర్యటనలో ప్రధానిని కలవాలని పీఎంఓ అధికారులు తనకు తెలిపారన్నారు. ఇదివరకు తాను ఢిల్లీ వెళ్లినప్పటికీ.. ప్రధానిని ఎప్పుడూ కలుసుకోలేదని గుర్తు చేశారు.

ప్రధాని మోదీ తనను అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. తనకు అవగాహన ఉన్నంత మేరకు అన్ని విషయాలను ఆయనకు వివరించానన్నారు. మోదీతో తాను భేటీ కావడం భవిష్యత్తులో అనేక పరిణామాలకు నాంది పలుకుతుందని పవన్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మంచి రోజులు వస్తాయని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని పవన్‌ చెప్పడం విశేషం. మోదీతో తన సమావేశం అలాంటి మంచి రోజులను తీసుకొస్తుందని పవన్‌ వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News