పిల్ల‌ల‌పై థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌ ఇలా ఉంటుంద‌ట‌!

Update: 2021-06-02 03:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త చూసిన త‌ర్వాత.. థ‌ర్డ్ వేవ్ ను త‌లుచుకొని జనం భ‌య‌ప‌డుతున్నారు. అది కూడా పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌నే వార్త‌లు వ‌స్తుండ‌డంతో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. దాని ప్ర‌భావం ఎలా ఉంటుంది? పిల్లలు ఎంత మేర ఎదుర్కోగ‌ల‌రు? ఎలాంటి విల‌యాన్ని చూపిస్తుంద‌న్న ప్ర‌శ్న‌ల‌కు ఎవ్వ‌రూ స‌రైన స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

కాగా.. ఈ విష‌య‌మై తాజాగా నీతిఅయోగ్ స‌భ్యుడు వీకే పాల్ స్పందించారు. దేశంలో కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా కూడా ఉన్న వీకే పాల్‌.. పిల్ల‌ల‌పై థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం గురించి మాట్లాడారు. థ‌ర్డ్ వేవ్ మొద‌లు కావ‌డానిక‌న్నా ముందే.. పిల్ల‌ల్లో ఇన్‌ఫెక్ష‌న్ పై దృష్టి సారించాల‌ని అన్నారు.

పిల్ల‌ల‌పై క‌రోనా ప్ర‌భావం ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని అన్నారు. అయిన‌ప్పటికీ.. ఆ ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు ముంద‌స్తుగా సిద్ధ‌మ‌వుతున్నామ‌ని చెప్పారు. థ‌ర్డ్ వేవ్ లో పిల్ల‌లు ఎలా ఉండాలి? త‌ల్లిదండ్రులు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? అనే విష‌య‌మై త్వ‌ర‌లో మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చెప్పారు.

వైర‌స్ రూపం మార్చుకుంటే ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండొచ్చ‌ని అన్న ఆయ‌న‌.. దానికి అనుగుణంగా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకిన పిల్ల‌ల‌ను ప‌రిశీలించిన‌ప్పుడు కొత్త విష‌యాలు వెలుగు చూశాయ‌ని తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆరు వారాల‌ త‌ర్వాత పిల్ల‌ల్లో ఇత‌ర ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని పాల్ చెప్పారు. మొత్తానికి ప‌రిస్థితులు ఎలా ఉండ‌బోతున్నా.. వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. మ‌రోవైపు.. పిల్ల‌ల‌కు ఇచ్చే వ్యాక్సిన్ డోసుల అంశాన్ని ఆరోగ్య‌శాఖ ప‌రిశీలిస్తోంద‌ని అన్నారు.
Tags:    

Similar News