జగన్ ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్స్ లేరా?

Update: 2022-02-04 04:29 GMT
ప్రభుత్వం అనేది కోట్లాది మంది ప్రజల కోసం పనిచేస్తుంది. దైనందిన పాలనా వ్యవహారంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో కొన్ని జనాలకు నచ్చకపోవచ్చు. ఆయా సందర్భాలలో ఆయా వర్గాలను పిలిచి నచ్చ చెప్పాల్సిన బాధ్యత సర్కార్ పెద్దలకు ఉంటుంది. ఒక వేళ తమదే పొరపాటు అయితే సరిచేసుకోవాల్సి ఉంటుంది.

ఇక్కడే ట్రబుల్ షూటర్స్ అనేవారు కీలకమైన పాత్ర పోషిస్తారు. జగన్ ప్రభుత్వంలో ఇపుడు అలాంటి వారు లేకపోవడమే అతి పెద్ద సమస్య అంటున్నారు. చెప్పాలీ అంటే ట్రబుల్స్ క్రియేట్ చేసేవారే అక్కడ  కనిపిస్తున్నారు. ఆ విషయం ఇంతకు ముందు అనేక సందర్భాల్లో బయటపడినా ఇపుడు ఏపీలో అతి పెద్ద వర్గంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనతో పూర్తిగా తేటతెల్లమైంది అంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు తమలో భాగం అని ప్రభుత్వం అనుకున్నపుడు వారితో చర్చలు జరిపే విధానం నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం అంటే మంత్రులు, మరీ ముఖ్యంగా ఉద్యోగులవి ఆర్ధికపరమైన సమస్యలు. సంబంధిత మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ముందు వరసలో ఉండాలి. ఆయన చూస్తే సీన్ లో ఎక్కడా కనిపించడంలేదు.

ఇక క్యాబినెట్  కి ఏ మాత్రం సంబంధం లేని ప్రభుత్వ సలహాదారు హోదాలో సజ్జల రామక్రిష్ణారెడ్డి ముందుకు వస్తున్నారు. పోనీ ఆయనేమైనా వయా మీడియాగా అటూ ఇటూ వ్యవహరిస్తున్నారా అంటే ఉద్యోగులు పెడుతున్న డిమాండ్లను మొదటికే తోసిపుచ్చుతున్నారు. దాంతో పాటు కొన్ని కామెంట్స్ కూడా ఉద్యోగులకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి అంటున్నారు.

ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కూడా పూర్తిగా అధికార భాషను వాడడం వల్ల సమస్య జఠిలం అవుతుంది తప్ప పరిష్కారం దరిదాపుల్లో ఉండదు, నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కార్ ని కోరి గెలిపించుకున్నారు. ఈ రోజుకీ వారిలో ఎక్కువ మంది జగన్ ప్రభుత్వమే ఉండాలనుకుంటున్నారు. నిజంగా ఒక ప్రభుత్వానికి ఇలా ప్రభుత్వ ఉద్యోగుల బలం అంటే ఎంతో సానుకూల అంశం.

మరి అలాంటి దాన్ని కోరి చెడగొట్టుకుంటే ఆ తప్పు ఎవరిది అన్నది కూడా చూడాలి. ఉద్యోగులు ఏం కోరారు, ప్రభుత్వం ఏం తీర్చాలనుకుంటోంది అన్న దాని మీద స్పష్టత లేకపోవడం వల్లనే కధ ఇంతదాకా వచ్చింది అని చెప్పాలి. గత నెల‌ మొదటివారంలో జగన్ తో ప్రభుత్వ ఉద్యోగులు జరిపిన చర్చలలో ఫిట్మెంట్ మీద ఒప్పందం కుదిరింది. ఐఅర్ 27 శాతం నుంచి 23 శాతంగా ఫిట్మెంట్ నిర్ణయించినా ఉద్యోగులు కాస్తా ఇబ్బందిపడుతూనే ఓకే అన్నారని వార్తలు వచ్చాయి.

ఇక అక్కడితో సామరస్యంగా కధ ముగుస్తుంది అంటే ప్రభుత్వం వైపు నుంచే మరి కొంత గ్యాప్ వచ్చేలా చేశారని అంటున్నారు. అదెలా అంటే హెచ్ ఆర్ ఏ ను భారీగా కోత పెట్టడం, అర్ధరాత్రి జీవోలు, అలాగే అప్పటిదాకా అమలు చేసిన ఐఅర్ విషయంలో తీసుకున్నమొత్తాలను రికవరీ చేస్తామనడం వంటివే ఉద్యోగులను మండించాయని అంటారు. ఈ కీలక సమయంలో వారితో చర్చలు జరిపి సమస్యలు ఒక కొలిక్కి తీసుకువచ్చే ట్రబుల్ షూటర్స్ లేకపోవడమే ఇపుడు అతి పెద్ద లోటు అని చెబుతున్నారు.

ఇక మరో వైపు చూస్తే ప్రభుత్వ పక్షాన మాట్లాడేవారు సమస్యను సరిగ్గా టాకిల్ చేయడంలేదా అన్న డౌట్లు వస్తున్నాయి. మేము చేయాల్సింది చేశాము, ఇక మీ ఇష్టమని వైసీపీ తరఫున కొందరు నేతలు లేని బాధ్యత తీసుకుని చెప్పడం వల్లనే ఇపుడు ఉద్యోగులు చలో విజయవాడ దాకా వచ్చారని అంటున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగులతో సామరస్యంగా చర్చించే వాతావరణాన్ని క్రియేట్ చేసే వారు లేకపోవడం విశేషం.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి వారు ఐఅర్ ని అప్పుగా చూడాలని  చెప్పడాన్ని కూడా ఉద్యోగులు తప్పు పడుతున్నారు. ఇపుడు మంట మీద ఉన్న ఉద్యోగుల విషయంలో కావాల్సింది ఊరట మాటలు, ఒక భరోసా. అదే విధంగా రండి అన్ని విషయాలూ కలిపి చర్చిద్దామని పిలుపు. కానీ సీన్ చూస్తే అలా లేదు, మేము అన్నీ ఇచ్చేశాము, మీ డిమాండ్లకు అంగీకరించేది లేదు అన్నట్లుగా కొందరు నాయకులు చేస్తున్న కామెంట్స్ మొత్తం బిగ్ ట్రబుల్ ని క్రియేట్ చేస్తున్నాయని అంటున్నారు.

చూడబోతే ఈ వ్యవహారం కాస్తా ఇంకా ముందుకు జరిగి భారీ సమ్మె దిశగా కధ సాగితే ఆ తప్పు ఉద్యోగులదా సర్కార్ దా అంటే రాష్ట్ర పెద్దగా ఉన్న సర్కార్ వారిదే అని చెప్పాలేమో. ఏది ఏమైనా ఉద్యోగుల విషయంలో ఇప్పటికైనా సామరస్య వైఖరితో చర్చలకు ఆహ్వానం పలికితే ప్రభుత్వానికి ప్రజలకూ కూడా మంచిది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News