ఈ పెట్రోలు సవాళ్ళేంటి స్వామీ ?

Update: 2022-01-22 13:30 GMT
ఇంతకీ సభ్య సమాజానికి మన రాజకీయ నాయకులు ఏమి సందేశం ఇస్తున్నారు అన్న సందేహమే ఎవరికైనా వస్తోందిపుడు. నేతలు బాగా ఉంటే జనాలు కూడా వారిని అనుసరిస్తారు. అసలే యువత అసహనంతో ఉంది. అయిన దానికీ కానిదానికీ ఆత్మహత్యలకు తెగిస్తోంది. మరో వైపు కామంధులు పెట్రోలు పోసి యువతులను తగలబెడుతున్న సన్నివేశాలు కూడా ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఇలాంటి చోట పాలకులు, నాయకులు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉండదా అన్నదే చర్చ.

తాజాగా గుడివాడలోని తన కె కన్వెషన్ సెంటర్ లో కేసినో ఆటలు జరిపించారని మంత్రి కొడాలి నాని ఆరోపణలు విపక్షాల నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనకు మండి తన మీద వచ్చిన ఈ ఆరోపణలు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తనను తాను తగలబెట్టుకుంటాను అని వేడి వేడి సవాల్ చేసి పారేశారు. అంటే తాను చెప్పేది పరమ‌ సత్యమని, అది అసత్యమని తేలిన నాడు  ఆత్మాహుతే శరణ్యమన్న తీరున మంత్రి గారు భీషణ ప్రతిజ్ఞ చేశారన్న మాట.

ఈ సవాల్ కి ఒక రోజు తరువాత టీడీపీ తమ్ముళ్ళ నుంచి ప్రతి సవాల్ వచ్చేసింది. మాజీ మంత్రి దేవినని ఉమామహేశ్వరరావు ముందుకు వచ్చి తాను మంత్రి సవాల్ ని స్వీకరిస్తున్నానని, కేసినో ఆటలు గుడివాడలో సాగాయని నిరూపిస్తానని అంటున్నారు. ఒక వేళ తాను నిరూపించకపోతే పెట్రోల్ తో తనను తాను తగులబెట్టుకుంటాను అని కొడాలి స్టైల్ లోనే దేవినేని కూడా ప్రతి సవాల్ చేశారు.

ఇక మరో టీడీపీ నేత బోండా ఉమామమేశ్వరరావు కూడా తాను  రెడీ అంటున్నారు. ఏకంగా తమ వద్ద కేసినో ఆటలలో ఎవరు పాల్గొన్నారో మొత్తం చిట్టా ఉందని, మంత్రి అడ్డంగా బుక్ అయ్యారని, ఇక తప్పించుకోలేరని కూడా అంటున్నారు. తాను కనుక కేసినో ఆటలు అక్కడ జరిగాయని నిరూపించకపోతే మాత్రం పెట్రోల్ పోసుకుని తగులబెట్టుకుంటాను అంటున్నారు.

సరే సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ  బాగానే ఉన్నాయి కానీ మధ్యలో ఈ పెట్రోలు పోసుకోవడాలు ఎందుకు స్వామీ అన్నదే ఇక్కడ అందరి మాటగా ఉంది. మంత్రి గారిది తప్పు అయితే ఆయన రాజీనామాను కోరాలి. ఇక విపక్షం తాము చెప్పేది తప్పు అయితే క్షమాపణ చెప్పడం ద్వారా కధను సుఖాంతం చేయాలి. అంతే తప్ప పెట్రోల్ పోసుకుని తగులబెట్టుకుంటామని, ఆత్మాహుతికి పాల్పడతామని చెప్పడం ద్వారా సభ్య‌ సమాజానికి ఇచ్చే సందేశం ఏంటో నేతాశ్రీలు తెలుసుకోవాలని విలువైన సూచనలు వస్తున్నాయి.

ఇలాంటి రెచ్చగొట్టే సవాళ్ళ వల్ల నాయకులు బాగానే ఉంటారని, వాటి ప్రభావానికి లోను అయిన సగటు కార్యకర్తలు కానీ సామాన్యులు కానీ బలి అవుతారు అని అంటున్నారు. మొత్తానికి రాజకీయ విమర్శలు హద్దులు దాటి పెట్రోలు తో తగులబెట్టుకోవడాలు దాకా రావడం మంచిది కాదన సూచనలు అయితే అన్ని వైపుల నుంచీ వస్తున్నాయి.  చూడాలి మరి ఈ పెట్రోల్ పరి భాషను నేతాశ్రీలు మానుకుంటారో లేదా అన్నది.
Tags:    

Similar News