ఓరి నాయ‌నా.. ఇదేం పెళ్లి అగ్రిమెంట్ రా బాబూ!

Update: 2022-09-13 15:30 GMT
కొన్ని వివాహాలు విచిత్రంగా ఉంటాయి. ఆయా దేశాల్లో.. ఆయా జాతుల్లో.. ఆయా మతాల్లో.. కులాల్లో జ‌రిగే పెళ్లిళ్లు సాటివారికి వింత‌గా, విచిత్రంగా అనిపిస్తాయి. అయిన‌ప్ప‌టికీ త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయాల‌ని చెప్పి వాటిని ఈ ఆధునిక యుగంలోనూ పాటించేవారే ఎక్కువ‌.

ఇక పెళ్లి చేసుకున్న త‌ర్వాత అమ్మాయి పెట్టే ఆంక్ష‌ల‌ను త‌ట్టుకోవ‌డం అబ్బాయికి క‌ష్ట‌మే. పెళ్లి అయ్యాక అంత‌కుముందున్న అన్ని అలవాట్ల‌ను అబ్బాయి మార్చుకోవాల్సిందే. పెళ్లికి ముందులాగా ఫ్రెండ్స్‌తో లేట్ నైట్ పార్టీలు, షికార్లు కొట్ట‌డం కుద‌ర‌దు. ఎప్పుడు ప‌డితే అప్పుడు బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి వీలుండ‌దు.  ఆట‌లు, పాట‌లు, విందు వినోదాలు, షికార్లు, క‌బుర్లు ఇలా అబ్బాయి అన్ని అల‌వాట్లే గిర్రున తిరిగిపోయి మారిపోతాయి. పెళ్ల‌యిన ద‌గ్గ‌ర నుంచి కుటుంబ అవ‌స‌రాల‌కు అనుగుణంగా లేదా భార్య చెప్పిన‌ట్టు న‌డుచుకోక త‌ప్ప‌దు.

ఈ నేప‌థ్యంలోనే ఒక పెళ్లి కుమారుడి ఫ్రెండ్స్ చేసిన ప‌ని న‌వ్వులు పూయిస్తోంది. వారు చేసిన ప‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

వివ‌రాల్లోకెళ్తే.. తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంబట్టి మునిసిపాలిటీ పరిధిలోని కిజాపుదూర్ ప్రాంతానికి చెందిన హరిప్రసాద్ ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చ‌ర‌ర్. ఇత‌డికి స్నేహితుల సంఖ్య ఎక్కువే. వీరితో త‌ర‌చూ స‌మ‌యం దొరిక‌న‌ప్పుడ‌ల్లా క్రికెట్ ఆడుతుంటాడు. ఈ నేప‌థ్యంలో హ‌రిప్ర‌సాద్ కు ఇటీవ‌ల పూజ అనే అమ్మాయితో వివాహం కుదిరింది.

ఈ నేప‌థ్యంలో హ‌రిప్ర‌సాద్ స్నేహితులు వినూత్నంగా ఆలోచించారు. త‌మ స్నేహితుడికి పెళ్ల‌యితే త‌మ‌తో ఇక ఇంత‌కుముందులాగా క్రికెట్ ఆడుకోవ‌డానికి రాడేమోన‌ని ఒక ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా హ‌రిప్ర‌సాద్ పెళ్లి రోజు అత‌డు తాళిబొట్టు క‌ట్టేముందు ఒక అగ్రిమెంట్ ప‌త్రం రాసి పెళ్లి కుమార్తె చేతిలో పెట్టారు. అది చదివిన పెళ్లి కుమార్తె పూజ త‌న న‌వ్వులు ఆపుకోలేక‌పోయింది. ఏమైంది.. అందులో ఏముంద‌ని అంతా అడ‌గ‌డంతో ఆ అగ్రిమెంటును చ‌దివి వినిపించింది.

పెళ్ల‌య్యాక కూడా వీకెండ్స్ లో త‌మ స్నేహితుడు హ‌రిప్ర‌సాద్ ను త‌మ‌తో క్రికెట్ ఆడుకోవ‌డానికి వెళ్ల‌నివ్వాల‌ని.. అత‌డిపైన ఈ విష‌యంలో ఆంక్ష‌లు విధించ‌కూడ‌ద‌ని.. ఇందుకు పూజ ఒప్పుకోవాలంటూ అగ్రిమెంటులో రాశారు. దీన్ని ఒప్పుకుంటూ ఆమె సంత‌కం చేస్తేనే వివాహానికి ఒప్పుకుంటామంటూ స‌ర‌దాగా మెలిక‌పెట్టారు. దీంతో పెళ్లి కుమార్తె పూజ ఈ అగ్రిమెంటుకు ఒప్పుకుంటూ సంత‌కం చేసింది. దీంతో హ‌రిప్ర‌సాద్ స్నేహితులు ఈ పెళ్లికి అంగీకారం తెలిపారు. దీంతో హ‌రిప్ర‌సాద్ కూడా న‌వ్వుతూ పూజ మెడ‌లో తాళిక‌ట్టాడు.

ఈ అగ్రిమెంట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీనికి లైకులు, కామెంట్లు, షేర్లు హోరెత్తుతున్నాయి. ఈ స‌ర‌దా అగ్రిమెంట్ అంద‌రిచేత న‌వ్వులు పూయిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News