క‌రోనా నుంచి కోలుకున్న దంప‌తుల క‌థ ఇది..

Update: 2020-04-10 00:30 GMT
ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కొంత క‌ట్ట‌డి అయ్యింద‌ని తెలుస్తోంది. క‌రోనా బారిన ప‌డి వైద్యం పొందిన వారు కోలుకుంటున్నారు. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు క‌రోనా నుంచి కోలుకుని ఇళ్ల‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖప‌ట్ట‌ణంలో క‌రోనా బారిన ప‌డిన దంప‌తులు వైద్య చికిత్స పొంది ఇప్పుడు క‌రోనాను జ‌యించారు. వారి వైద్యం పూర్త‌యి చివ‌ర‌కు క‌రోనా నెగ‌టివ్ రావ‌డంతో వారిని ఆస్ప‌త్రి నుంచి ఇంటికి పంపించారు. ఈ సంద‌ర్భంగా వారు ఒక మీడియాతో మాట్లాడుతూ క‌రోనా సోకింది ఎలానో? క‌రోనా బాధితుల‌కు అందుతున్న వైద్యం త‌దిత‌ర విష‌యాలు ఆ దంప‌తులు వివ‌రంగా చెప్పారు.

విశాఖ‌ప‌ట్ట‌ణంలో చెప్పుల దుకాణం నిర్వ‌హించే వ్య‌క్తి (65) వయసు పైబడడంతో వ్యాపారం మానేసి ఇంటికే పరిమితమయ్యాడు. ఆ క్ర‌మంలో భార్య (59) కోరిక మేర‌కు భ‌ర్త మ‌క్కా యాత్రకు బ‌య‌ల్దేరారు. హైద‌రాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లి 15 రోజుల అనంత‌రం మార్చి 10వ‌ తేదీన హైదరాబాద్‌ చేరుకున్నాడు. హైద‌రాబాద్‌లో ఉన్న కుమార్తె ఇంట్లో రెండు రోజులు ఉండి మార్చి 12వ తేదీన విశాఖప‌ట్ట‌ణం వచ్చాడు. ఆ స‌మ‌యంలోనే క‌రోనా ల‌క్ష‌ణాలు వ‌చ్చాయి. ఒంట్లో నీరసంగా ఉండడం.. భోజ‌నం తిన‌క‌పోవ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ప‌రీక్షించిన వైద్యులు 14 రోజుల పాటు ఆస్ప‌త్రి లో ఉండాలని ఆదేశించారు. ఆస్ప‌త్రిలో భోజనం అందిస్తున్నా తినాల‌నిపించేది కాదు. ఆస్ప‌త్రిలో ఉండలేక వైద్యుల‌ను ఇంటికి పంపించేయాలని అడిగ్గా.. కొన్ని రోజుల్లో వెళ్తార‌ని చెప్పారు. కరోనా వైరస్‌ నివారణకు, షుగర్‌ కు మందులు ఇచ్చేవారు. వైద్యులు, పిల్లలు ధైర్యం చెప్పేవారు. రెండుసార్లు నెగెటివ్‌ రిపోర్టు వచ్చాక 20 రోజుల తర్వాత మీరు ఇంటికి వెళ్లి పోవచ్చని వైద్యులు చెప్పారు. అప్పుడు చాలా ఆనందించా. ఇప్పుడు ఇష్ట‌మైన ఆహారం తింటూ ఇంట్లోనే ఉంటున్నా. అయితే క‌రోనా వైరస్ సోకింద‌ని చెప్ప‌గా ఏం భ‌య‌ప‌డలేదు. వైద్యం కంటే ఆత్మస్థైర్యమే ముఖ్య‌మ‌ని వైద్యులు చెప్ప‌డంతో ధైర్యంగా ఉన్నా. అయితే నా వల్ల భార్యకు క‌రోనా వైర‌స్ సోకిందని తెలియ‌డంతో బాధపడ్డా.

వైద్యుల సేవ‌తో ఆరోగ్యంగా: భార్య‌

క‌రోనా వైరస్ మా భ‌ర్త వ‌ల్ల సోకింది. అయితే నా భ‌ర్త‌ను నేనే ద‌గ్గ‌రుండి మ‌క్కాకు పంపించా. వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న అనారోగ్యం పాల‌య్యాడు.  మక్కా నుంచి వచ్చిన తరువాత పేద‌ల‌కు సేవా కార్య‌క్ర‌మాలు చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాం. కానీ ఆయన అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. స్థానిక వైద్యులు ప‌రిశీలించి ఛాతీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్కడ పరీక్షలు చేసిన అనంత‌రం క‌రోనా వైరస్ సోకింద‌ని తెలిపారు. పది రోజులపాటు ఛాతీ ఆస్ప‌త్రిలో, ఆ తరువాత గీతం ఆస్ప‌త్రిలో వైద్యం అందించారు. ఆ స‌మ‌యంలో ఉదయం, సాయంత్రం రెండు రకాల మాత్రలు పది రోజుల పాటు ఇచ్చారు.

ఆ స‌మ‌యంలో ఒంటరిగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. నిద్ర పట్టేది కాదు. దీంతో నిద్ర పోయేందుకు మందులు ఇచ్చేవారు. మా అమ్మాయి రోజు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు, బంధువులు ఫోన్‌ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పేవాళ్లు. మిగిలిన సమయంలో దేవుడిని ప్రార్థించేదాన్ని. నాకంటే  ముందు నా భ‌ర్త డిశ్చార్జవ‌డంతో ఆనందించా. నేను ఆస్ప‌త్రి నుంచి బయటపడతానో లేదోనని ఆందోళ‌న చెందా. ఆస్ప‌త్రిలో ఉదయం ఇడ్లీ, పాలు, గుడ్డు ఇచ్చేవాళ్లు. మధ్యాహ్నం - రాత్రికి మూడు చపాతీలు - దద్దోజనం - కూరతో కూడిన భోజనం అందించేవాళ్లు. వైరస్‌ బారిన పడినవాళ్లు భయపడవ‌ద్ద‌ని చెప్ప‌డంతో నేను ధైర్యంగా వైద్యం తీసుకున్నా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా.
Tags:    

Similar News