అదిరిన రాజస్థాన్ మంత్రి రాఖీ ఐడియా

Update: 2015-08-12 04:45 GMT
రాజకీయ నాయకులు చాలావరకూ పనికిమాలిన రాజకీయాలు తప్పించి.. ప్రజలకు పనికి వచ్చే పనులు చేయరన్న విమర్శ చాలా తరచుగా వినిపిస్తుంటుంది. కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవటం.. డబ్బు సంపాదన తప్పించి మరోకటి ఉండదని కూడా ఈసడించుకోవటం కనిపిస్తుంటుంది.

అయితే.. అందరూ ఒకేలా ఉండరన్న విషయం రాజస్థాన్ లోని వైద్య ఆరోగ్య శాఖామంత్రి రాజేంద్ర రాథోడ్ ను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. దేశం మొత్తానికి పనికి వచ్చే ఐడియా ఒకటి ఆయన వేశారు. వ్యసనాలకు బానిసై.. తమ ఆరోగ్యం పాడు చేసుకునే ప్రజల్ని భావోద్వేగ బంధంతో నియంత్రించాలన్న ఆయన ఐడియా ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందో కానీ.. అందరి దృష్టిని మాత్రం ఆకర్షిస్తోంది.

సెల్ఫీ విత్ డాటర్ ను స్ఫూర్తిగా తీసుకొని సెల్ఫీ విత్ బ్రదర్ అనే పోటీని స్టార్ట్ చేసిన ఆయన.. రాఖీ సందర్భంగా.. సోదరుడికి రాఖీలు కట్టే సోదరీమణులు.. తమ అన్నలు.. తమ్ముళ్లను పొగాకు మానేస్తానని ప్రమాణం చేయించుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు.. ఇలాంటి ప్రమాణ పత్రం తీసుకొని సోదరుడితో కలిసి సెల్ఫీ తీసుకొని తమ శాఖకుపంపితే.. కొందరిని ఎంపిక చేసుకొని మరీ సత్కరిస్తామని చెబుతున్నారు.

సత్కారం లాంటి విషయాల్ని పక్కన పెడితే.. రాఖీ సందర్భంగా రాఖీ కట్టి.. తన సోదరుడు మంచి ఆరోగ్యంతో ఉండాలన్న ఆకాంక్షను సోదరీమణులు వ్యక్తం చేసి.. వారి దగ్గర పోగాకు మానేస్తామన్న మాటను ప్రమాణంగా తీసుకుంటే.. రాఖీ పండుగకు సరికొత్త శోభ రావటం ఖాయం. ఇలాంటి చక్కటి ఆలోచన చేసిన రాజస్థాన్ మంత్రి రాజేంద్ర రాథోడ్ ను అభినందించాల్సిందే.

Tags:    

Similar News