డాటర్ ఆఫ్ ఫైటర్... ఫ్లెక్సీలతో నింపేశారు

Update: 2022-12-11 08:31 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈ రోజు సీబీఐ అధికారులు ప్రశ్నలు వేస్తున్న సంగతి తెలిసిందే. తనకీ ఉదంతంలో ఎలాంటి సంబంధం లేదని కవిత పేర్కొనడం తెలిసిందే. అయితే.. ఆమె ప్రమేయం ఉందంటూ ఇప్పటికే అధికారులు పేర్కొనటం..

అనంతరం ఆమెను విచారించేందుకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. అయితే.. ఆమెను ప్రాథమికంగా ప్రశ్నించేందుకు వీలుగా ఆమెకు అనువుగా ఉన్న తేదీల్ని చెప్పాలని అధికారులు కోరగా.. ఆమె ఈ రోజు (ఆదివారం, డిసెంబరు11న) హైదరాబాద్ లోని తన నివాసానికి రావాలని పేర్కొనడం తెలిసిందే.

సీబీఐ అధికారులు కవిత ఇంటికి రావటానికి ఒక రోజు ముందు ఆమె ఇంటి వద్ద భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫైటర్ కేసీఆర్ డాటర్ కవిత అని.. ఆమె తగ్గేదేలే అని.. పోరాటానికి మారుపేరు కవిత అని.. తండ్రికి తగ్గ ఫైటర్ కవిత అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

నిజానికి ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద వాతావరణం ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. ఆమె ఇంట్లో ఉన్నారంటే చాలు.. ఆమెను కలిసేందుకు.. ఆమెతో తమ పనుల గురించి మాట్లాడేందుకు.. సమస్యల పరిష్కారం పెద్ద ఎత్తున వస్తుంటారు. దీనికి తోడుఅనుచరుల హడావుడి ఎక్కువే.

దీంతో.. కవిత ఇంటి పరిసరాలు ఎప్పుడూ కార్లు.. మనుషులతో సందడి సందడిగా ఉండటం మామూలే. దీనికి తోడు సీబీఐ అధికారులు విచారణలో భాగంగా ఇంటికి వస్తున్నారన్నంతనే ఇంటి పరిసరాల్లో భారీ ఎత్తున కటౌట్లు.. ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో కవితకు తాము దన్నుగా నిలుస్తామని పేర్కొంటూ పలువురు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో.. ఆదివారం నాడు సీబీఐ అధికారులు వచ్చే వేళకు.. పరిస్థితులు ఎలా ఉంటాయన్న సందేహం వ్యక్తమైంది.

అంచనాలకు భిన్నంగా ఆదివారం ఉదయం నాటికి కవిత ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. ఆమె స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు నమోదు చేసేందుకు వచ్చే వేళ.. ఎలాంటి హడావుడి ఉండకూడదన్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. బల ప్రదర్శనకు పెద్ద ఎత్తున వస్తామన్న కొందరి అభిమానులకు అలాంటివేమీ వద్దన్న మాట గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. రోటీన్ కు భిన్నంగా కవిత ఇంటి వద్ద పరిశరాలు నిర్మానుష్యంగా మారాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News