సర్పంచ్ లు తర్వాత.. ముందు సీఎంల సంగతేంటి మోడీ సాబ్?

Update: 2020-07-01 16:00 GMT
వేదిక ఏదైనా.. విషయం మరేదైనా.. తన ప్రసంగంలో కొన్ని ఉదాహరణల్ని ప్రస్తావిస్తూ.. ప్రజలంతా తన మాటల్ని ఆసక్తిగా వినేలా చేసే నైఫుణ్యం ప్రధాని మోడీలో ఎక్కువన్న విషయం తెలిసిందే. జాతి ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారంటూ మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలోసాగిన హడావుడి అంతా ఇంతా కాదు. కీలకమైన ప్రకటన ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. సాయంత్రం నాలుగు గంటలు ఎప్పుడు అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి మోడీ మాటలు అంతగా ఎక్కలేదనే చెప్పాలి.

మోడీ చెప్పిన మాటలు ప్రజల మీద అంతగా ప్రభావం చూపలేని రీతిలో ఉన్నాయన్న అభిప్రాయం పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. మోడీ నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలపై విస్మయం వ్యక్తమవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించక పోవటాన్ని తప్పు పట్టారు. మాస్కు నిబంధన ను ఉల్లంఘించిన ఒక దేశ ప్రధాని కి సుమారు రూ.13వేల జరిమానా ను విధించారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇదే విధానాన్ని స్థానిక ప్రభుత్వాలు చూపాలన్న ఆయన.. ప్రధాని అయినా గ్రామ సర్పంచ్ అయినా రూల్ రూలే అని పేర్కొన్నారు.

మోడీ మాటలు వినేందుకు బాగున్నా.. ప్రాక్టికల్ గా ఇష్యూలను క్లోజ్ చేయటం లేదన్న మాట వినిపిస్తోంది. మాస్కు నిబంధననే తీసుకుంటే.. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాస్కుల్ని వినియోగించకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనటం మీడియా లోనూ.. సోషల్ మీడియా లోనూ చూస్తున్నాం. మరి.. ఇలాంటి వారికి హెచ్చరిక లుజారీ చేసేలా వ్యాఖ్యలు ఎందుకు చేయరన్నది ప్రశ్న గా మారింది. సర్పంచ్ లు లాంటి చిన్న స్థాయి నేతలకు సూచనలు చేసే ప్రధాని మోడీ.. సీఎంలకు ఎందుకు చెప్పనట్లు?

సూటిగా సుత్తి లేకుండా.. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా.. రాష్ట్ర రథసారధులైన మీరే మాస్కులు పెట్టుకోకుంటే.. మిగిలిన ప్రజల గురించి ప్రస్తావించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. మాస్కుల వినియోగం తప్పనిసరి అని చెప్పే మోడీ మాష్టారు.. అంతకు ముందు నిబంధనల్ని ఉల్లంఘించే ముఖ్యమంత్రులపై కేంద్రమే ఫైన్ వేస్తే మరింత స్ఫూర్తిగా నిలుస్తుంది కదా? ఆ పని చేస్తే.. మిగిలిన వారంతా దెబ్బకు దారిలోకి వస్తారు కదా? 
Tags:    

Similar News