భారత విజయాన్ని దెబ్బ తీసిన ఆ ముగ్గురు

Update: 2021-10-25 04:21 GMT
సెంటిమెంట్ మనవైపే ఉంది. బలాబలాల్ని చూసినా మనోళ్లే తోపులు. వరుస విజయాలతో మాంచి ఊపు మీద ఉన్న వేళ.. దాయాదితో మ్యాచ్ అంటే చెలరేగే టీమిండియా తాజాగా జరిగిన మ్యాచ్ లో చేష్టలుడిగిపోయినట్లుగా.. పసికూన జట్టు మాదిరిగా ఆడిన ఆటను భారత క్రికెట్ అభిమానులు ఎంత త్వరగా మర్చిపోవాలో అంత త్వరగా మర్చిపోయే ప్రయత్నం చేశారని చెప్పాలి. జట్ల బలాబలాలు చూసినా.. బలహీనంగా ఉన్న పాక్ అద్భుత విజయాన్ని సాధిస్తే.. గెలుపు ఖాయమన్న ధీమా టీమిండియాను దెబ్బ తీసిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గెలుపు ఖాయమని.. ఎంత భారీగా గెలుస్తామన్నదే లెక్క అన్నట్లుగా.. విజయోత్సవాలకు సిద్ధమై మ్యాచ్ చూసిన అభిమానులంతా నీరస పడిపోవటమే కాదు.. నిరుత్సాహంతో నిద్రకు ఉప క్రమించిన పరిస్థితి. వీకెండ్ చివరి గంటల్లో ఎదురైన ఈ షాక్ నుంచి త్వరగా బయటపడాలంటే.. ‘ఈ రోజు మనది కాదు’ అని సరిపెట్టుకోవటం మినహా మరో మార్గం లేదు. మ్యాచ్ ఆరంభానికి ముందు విజయానికి ఎంతో దగ్గరగా కనిపించిన టీమిండియా జట్టు.. మ్యాచ్ మొదలైన తర్వాత మాత్రం ఓటమికి చాలా దగ్గరగా వెళ్లిపోయిందన్న భావన కలిగింది. దీనికి కారణం పాక్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లుగా చెప్పాలి.
టాస్ ఓడి బౌలింగ్ ఎంచుకున్న పాక్ జట్టు.. ఓపెనర్లను దెబ్బ తీసి..టీమిండియా స్థైర్యాన్ని భారీగా దెబ్బ తీసింది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మొదలైన ఈ మ్యాచ్.. కొద్ది నిమిషాలకే కోలుకోలేని దెబ్బ తగిలింది. వార్మప్ మ్యాచ్ లో చెలరేగిపోయిన రోహిత్.. రాహుల్ తేలిపోవటం ఒక ఎత్తు అయితే.. పాక్ బౌలర్లలో అత్యంత ప్రమాదకారి అయిన షహీన్ అఫ్రిది టీమిండియాకు షాకుల మీద షాకులు ఇచ్చాడు.

వేగంగా వచ్చే బంతులకు ఆలస్యంగా స్పందించి వికెట్ కోల్పోయే రోహిత్ బలహీనతను సొమ్ము చేసుకున్నాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు పడిపోవటం.. తర్వాతి వికెట్ కుడా వెంటనే పడటంతో భారత్ తీవ్రమైన ఒత్తిడికి గురైంది. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి మూడువికెట్ల నష్టానికి కేవలం 36 పరుగులు చేయటం.. పవర్ ప్లేలో జరిగిన నష్టాన్ని సరిద్దే బాధ్యతను కెప్టెన్ కోహ్లి.. పంత్ తో కలిసి తీసుకున్నాడు. ఆచితూచి అన్నట్లు ఆడిన కోహ్లీ.. అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాట్ ను ఝుళిపించి స్కోర్ ను పెంచే ప్రయత్నం చేశాడు. 11 ఓవర్లకు మూడువికెట్ల నష్టానికి 66 పరులు చేరుకున్న వేళ.. రిషబ్ పంత్ చెలరేగి ఆడాడు. అతడి ఊపు చూస్తే.. గౌరవప్రదమైన స్కోర్ చేసే అవకాశం ఉందన్న భావన కలిగింది.కానీ.. 13వ ఓవర్లో పంత్ ను ఔట్ చేయటం ద్వారా షాదాబ్ టీమిండియాను మరోసారి దెబ్బ తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వారంతా ఆడామంటే ఆడామన్నట్లుగా ఆడారు. ఇలా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 151 పరుగులకే పరిమితమైంది. మూడు విలువైన వికెట్లను తీసిన షహీన్ షా ఆఫ్రిది భారత ఓటమికి బాటలు వేశాడని చెప్పాలి.

అనంతరం బ్యాటింగ్ మొదలు పెట్టిన పాక్ జట్టుకు టీమిండియా బౌలర్లు ఒత్తిడిలోకి నెట్టలేకపోయారు. కొన్ని చెత్త బంతుల్ని వేయటం ద్వారా వారిలో ఒత్తిడి స్థానే ఆత్మవిశ్వాసం పెరిగేలా చేశారు. ప్రమాదకరమైన పాక్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్.. బాబర్ అజామ్ లు కుదురుకోక ముందే వారిని అవుట్ చేయటంలో భారత బౌలర్లు ఫెయిల్ అయ్యారు. దీంతో పాక్ జట్టు వికెట్ నష్టపోకుండా 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి భారత్ దారుణంగా ఓడించారు. నూరు కోట్లకు పైగా ఉన్న టీమిండియా అభిమానుల్ని ఓటమి భారంలో కూరుకుపోయేలా చేశారు. ఇలా టీమిండియాను పాక్ బౌలర్ షహీన్ షా అఫ్రిది..ఓపెనింగ్ బ్యాట్సమెన్లు మహ్మద్ రిజ్వాన్.. బాబర్ అజామ్ లు ముగ్గురు కీలకమని చెప్పాలి.




Tags:    

Similar News