కరోనా నుంచి కోలుకున్న వారూ...జాగ్రత్తలు పాటించాల్సిందేనట!

Update: 2020-09-13 07:50 GMT
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా గురించిన భయాందోళనలు ఇంకా తొలగిపోలేదు. పలు దేశాల్లో కేసుల సంఖ్య తగ్గినా... భారత్ లో మాత్రం కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి నేపథ్యంలో కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం... తాజాగా కరోనా వైరస్ సోకి.. చికిత్స తీసుకుని కోలుకున్న వారికి కూడా కొన్ని నిబంధనలు సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారు... ఇక తమకేమీ కాదన్న రీతిలో వ్యవహరించడం కుదరదని, వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని సదరు ఆదేశాల్లో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.  ఈ మేరకు కొన్ని సూచనలతో కూడిన ప్రొటోకాల్‌ని జారీ చేసింది.

కరోనా నుంచి కోలుకున్న వారిలో అత్యంత అరుదుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ సదరు ఆదేశాల్లో కేంద్రం తెలిపింది. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా యోగాసనాలు చేయాలని, అలాగే తచరూ నోటిని పుక్కలిస్తూ ఉండాలని సూచించింది. ఇక వైద్యుల సలహా మేరకు ఆయుష్ కిట్‌ని వినియోగించుకోవాలని తెలిపింది. కోవిడ్-19 పై మరింత లోతైన అధ్యయనం, పరిశోధనలు అవసరమని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై కేంద్రం కొన్ని నిబంధనలతో కూడిన ప్రోటోకాల్ ను ప్రకటించింది. అందులోని ముఖ్యాంశాలు కిందివిధంగా ఉన్నాయి.

1.  మాస్క్‌ని తప్పనిసరిగా వాడాలి, చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. భౌతిక దూరం పాటించాలి.

2. గోరు వెచ్చని నీరు తాగుతూ ఉండాలి.

3. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్‌ మెడిసిన్‌ని వాడాలి.

4. ఆరోగ్యం బావుంటేనే ఇంట్లో పనులు చేసుకోవాలి. దశల వారీగా ఆఫీసు పనుల్లో చేరాలి.

5. వైద్యులు సూచించిన విధంగా రోజూ యోగాసన - ప్రాణాయామ - మెడిటేషన్ చేయాలి.

6. వైద్యుడు చెబితేనే బ్రీతింగ్ వ్యాయామం చేయాలి.

7. రోజూ ఉదయం లేదా సాయంత్రం వీలైనమేర నడవాలి.

8. సరిపడినంత న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలి.

9. తగినంత నిద్ర - విరామం తప్పనిసరి.

10. అధిక జ్వరం - శ్వాససంబంధ సమస్యలు - గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు ఉంటే ముందుగానే అప్రమత్తం అవ్వాలి.

11. కరోనాపై అవగాహన కలిగించేలా మీ అనుభవాలను స్నేహితులు, బంధువులతో పంచుకోవాలి.

12. కోలుకున్న వారం తరువాత తమ ఆరోగ్య పరిస్థితి పై వైద్యులతో మాట్లాడటం మంచిది.

13. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు ఏదైనా ఇబ్బందికర లక్షణాలు కనిపిస్తే.. దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లడం మంచిది.

14. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి క్రిటికల్ సపోర్ట్ అవసరం.
Tags:    

Similar News