హెల్మెట్ లేకుండా వెయ్యి షాక్.. ఎక్కడంటే?

Update: 2019-08-17 06:33 GMT
హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి?  పెట్టుకోకుంటే ఏమవుతుంది?  లాంటి విషయాలు ఇప్పుడు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. పది.. పదిహేనేళ్ల క్రితం ఇలాంటి అంశాలపై అవగాహన అవసరం కానీ.. ఇప్పుడే మాత్రం అవసరం లేదు. ఎందుకంటే.. హెల్మెట్ అవసరం ఇప్పుడు అందరికి అర్థమైన పరిస్థితి. అయినప్పటికీ.. హెల్మెట్ పెట్టుకొని వాహనాన్ని నడిపే విషయంలో మాత్రం ప్రజలు ఇప్పటికి రూల్స్ ను పాలో కాని పరిస్థితి.

కేవలం హెల్మెట్ పెట్టుకోని కారణంగా ప్రతి ఏటా వేలాదిగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో.. చట్టాలకు మరింత కరకుగా చేసే పనిలో ప్రభుత్వాలు పడ్డాయి. హెల్మెట్ లేకుండా బండి నడిపితే ఇప్పటివరకూ విధించే వంద రూపాయిల ఫైన్ కు భిన్నంగా జరిమానా మొత్తాన్ని వెయ్యిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో తాజాగా మార్చిన నిబంధనలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి.

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వంద ఫైన్ కాస్తా వెయ్యికి పెంచటంతో పాటు.. వెనుక కూర్చున్న వారు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వారిపైనా కచ్ఛితంగా ఫైన్ వేయాలన్న రూల్ ను తమిళనాడులో తాజాగా అమలు చేస్తున్నారు. ఇటీవల మోటారు చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణ జరిపి.. పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో చట్టాన్ని మార్చి తమిళనాడులో అమలు చేస్తున్నారు. చెన్నైలో ఇప్పటికే ఈ భారీ ఫైన్ల పర్వాన్ని షురూ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హెల్మెట్ రూల్ ను కఠినతరంగా అమలు చేయటం ద్వారా ప్రభుత్వానికి ఫైన్ల రూపంలో ఆదాయంతో పాటు.. ప్రజల ప్రాణాల్ని కాపాడినట్లు అవుతుంది. తమిళనాడు బాటలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికి ఫాలో అవుతాయో?


Tags:    

Similar News