ప‌శ్చిమ బెంగాల్ లో మ‌రోసారి డ‌బ్బు క‌ట్ట‌ల క‌ల‌క‌లం.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు!

Update: 2022-07-31 10:30 GMT
ప‌శ్చిమ బెంగాల్ లో తృణ‌మూల్ కాంగ్రెస్ మంత్రి పార్థా చ‌ట‌ర్జీ స‌న్నిహితురాలు అర్పిత ముఖ‌ర్జీ ఇంట్లో దాదాపు రూ.30 కోట్ల డ‌బ్బు, బంగారం, స్థిర‌, చ‌రాస్తుల‌కు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు ల‌భించడం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఉపాధ్యాయుల నియామ‌క ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డందుకు వ‌చ్చిన లంచాలే ఈ డ‌బ్బ‌ని తేలింది. దీంతో మంత్రి పార్థా చ‌ట‌ర్జీ, అర్పితను, మ‌రో ఇద్ద‌రిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు.

ఈ ఘ‌ట‌న స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే ప‌శ్చిమ బెంగాల్ లో మ‌రోసారి డ‌బ్బుల నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ‌టం సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది. ఈ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు న‌గదుతో పట్టుబట్టారు. కారులో భారీగా డబ్బును తరలిస్తున్న ముగ్గురు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు ప‌శ్చిమ బెంగాల్ లోని హౌరాలో అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మొత్తం ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్‌ కశ్యప్‌, నమన్ బిక్సల్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

ఎమ్మెల్యేల వ‌ద్ద ల‌భించిన డబ్బును క్యాష్‌ మెషిన్‌తో లెక్కిస్తున్నారు. ఎంత మనీ ఉందో తెలియాల్సి ఉంద‌ని చెబుతున్నారు. ఇక డబ్బును తరలిస్తున్న టయోటా ఎస్‌యూవీ కారు జమ్‌తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీదిగా గుర్తించారు. అలాగే రాజేశ్ ప్రస్తుతం కిజ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక బిక్సల్‌…కోల్‌బిరా నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఓవైపు పార్థా చ‌ట‌ర్జీ వ్య‌వ‌హారంలో నోట్ల క‌ట్టలు ప‌ట్టుబ‌డ‌టం, ఈ వ్య‌వ‌హారంలో ఈడీ సోదాలు ఇంకా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బులున్న బ్యాగులతో బెంగాల్‌లో పట్టుబడటం గ‌మనార్హం.

కాగా డ‌బ్బు క‌ట్ట‌లతో పట్టుబ‌డ్డ ముగ్గురు ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ పార్టీ స‌స్పెండ్ చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేష్ క‌శ్య‌ప్, న‌మ‌న్ బిక్స‌ల్ ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ ఎమ్మెల్యేల‌పై త‌క్ష‌ణ‌మే స‌స్పెన్ష‌న్ అమ‌ల్లోకి వ‌స్తుందని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. కాగా జార్ఖండ్ లో అధికారంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి బీజేపీనే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల‌కు డ‌బ్బులు ఇచ్చింద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోప‌ణ‌లు చేస్తోంది.
Tags:    

Similar News