రక్తపాతమే లక్ష్యంగా అడుగెట్టిన ఉగ్రవాదికి రక్తదానం చేసిన ముగ్గురు జవాన్లు!

Update: 2022-08-25 08:30 GMT
ఈ మధ్యనే విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న 'సీతారామం' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. పాక్ గడ్డ మీద నిర్వహించే రహస్య ఆపరేషన్ గురించి చెప్పే క్రమంలో.. భారత ఆర్మీకి.. పాకిస్థాన్ ఆర్మీకి మద్య తేడాను భారత ఆర్మీ ఉన్నతాధికారులు ప్రస్తావించటమేకాదు.. దానికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని చూపిస్తారు. భారత సైనికులు పాక్ ఆర్మీకి దొరికితే.. వారిని ఎంతలా హింసిస్తారన్న విషయాన్ని అందులో ప్రస్తావిస్తారు.

ఇవి చూసినంతనే రక్తం మరగటమే కాదు.. ఉగ్రవాదుల అంతు చూడాలనిపించటం ఖాయం. కానీ.. భారత్ తత్త్వం ఎంత భిన్నమన్న విషయం రీల్ లో కాదు.. రియల్ గా మరోసారి నిరూపితమైంది.

దేశంలో హింసాకాండను జరిపేందుకు.. అమాయకుల ప్రాణాలు తీసేందుకు అక్రమంగా దేశంలోకి చొరపడుతున్న ఉగ్రవాదికి ప్రాణాపాయం  ఎదురైతే భారత సైన్యం ఎంతలా స్పందించిన్న వైనం ఇప్పుడు అందరి అభినందనల్ని సొంతం చేసుకుంది. తమ ప్రాణాల్ని తీసే వాడు.. ఆపదలో ఉన్న వేళ.. అతడికి అవసరమైన రక్తదానం చేయటం ద్వారా ప్రాణాల్ని నిలిపారు. ఇంతకూ అసలేం జరిగిందంటే.

ఆగస్టు 21న జమ్మూ కశ్మీర్ లోని రాజౌరీ నౌషెరా సెక్టార్ లోని ఝూంగర్ వద్ద నియంత్రణ రేఖను దాటి భారత్ లోకి అక్రమంగా చొరబడే ప్రయత్నం చేసి సైన్యానికి దొరికిపోయాడు తబరక్ హుస్సేన్ అనే ఉగ్రవాది. ఇతగాడు మరో ముగ్గురితో కలిసి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నంలోనే దొరికిపోయాడు. సైన్యం జరిపిన కాల్పుల్లో గాయపడ్డాడు. ఇతడికి ఒక బుల్లెట్ తొడలో.. మరో బుల్లెట్ భుజానికి తాకింది. అతడికి ప్రాథమిక చికిత్స ఇచ్చి.. ఇతడికి రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరాన్ని గుర్తించారు.

ఆ వెంటనే సైన్యం స్పందించారు. ముగ్గురు సైనికులు సదరు ఉగ్రవాదికి అవసరమైన రక్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు సైనికులు ఇచ్చిన రక్తదానంతో అతగాడి ఆరోగ్య పరిస్థితి మెరుగైదని చెబుతున్నారు.  ప్రస్తుతానికి అతడి ప్రాణాలకు ఇబ్బంది లేదన్న మాట సైన్యం చెబుతోంది. ఇదిలా ఉంటే.. ఇతగాడు సంచలన ఆరోపణ చేశాడు. భారత సైన్యంపై ఆత్మాహుతి దాడి చేసేందుకు పాక్ ఆర్మీ కల్నల్ యూనస్ తనకు రూ.30వేలు ముట్టబెప్పినట్లుగా పేర్కొనటం సంచలనంగా మారింది.

సైనికుల ప్రాణాలు తీసేందుకు వచ్చిన ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోవటం.. అతనికి ప్రాణాపాయం తప్పేలా వ్యవహరించిన తీరుపై భారత సైనికుల మీద ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  ఏమైనా ఇలాంటివి భారత సైనికులు.. భారత్ ఆర్మీనే చేస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News