కోదండ‌రాంను ఎలా అరెస్ట్ చేశారో తెలుసా?

Update: 2017-08-13 04:19 GMT
తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క‌భూమిక పోషించిన కోదండం మాష్టారికి త‌ర‌చూ ఎదుర‌వుతున్న ప‌రిణామాలు అస్స‌లు అర్థం కాన‌ట్లుగా మారిపోతున్నాయి. ఆయ‌న ఎక్క‌డ‌.. ఏ స‌మావేశాన్ని ఏర్పాటు చేసినా.. ఏ చైత‌న్య‌స‌ద‌స్సుకు హాజ‌ర‌వుతున్నా పోలీసులు అడ్డుకోవ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. తాజాగా ఆయ‌న్ను అడ్డుకోవ‌టం.. అరెస్ట్ చేసిన తీరు చూస్తే కోదండం మాష్టారి ఆరోప‌ణ‌ల్లో అర్థం ఉంద‌ని చెప్పక త‌ప్ప‌దు.

అంతేకాదు.. తాను క‌ల‌లు క‌న్న రాష్ట్రంలో త‌న ప‌ట్ల తెలంగాణ పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆయ‌న‌కు ఎంత‌మాత్రం మింగుడుప‌డ‌ని రీతిగా మారింది. తాజాగా నిజామాబాద్ లో అమ‌ర‌వీరుల స్ఫూర్తి యాత్ర స‌మావేశానికి కోదండం మాష్టారు వెళ్లాల్సి ఉంది. కానీ.. ఆయ‌న్ను ఆ స‌మావేశానికి వెళ్ల‌నీయ‌కుండా పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఇక‌.. కోదండ‌రాం అయితే త‌మ‌ను టెర్ర‌రిస్టుల్ని చూసిన‌ట్లు చూస్తున్నారంటూ మండిప‌డ‌ట‌మే కాదు.. త‌మ యాత్ర‌ను అడ్డుకునేందుకు టెర్ర‌రిస్టుల కోసం మోహ‌రించ‌నంతగా బ‌ల‌గాల్ని మోహ‌రించారంటూ ఆరోపించారు. ఇంత‌కీ కోందండం మాష్టార్ని అడ్డుకునే క్ర‌మంలో పోలీసులు అత్యంత నాట‌కీయంగా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం.

శ‌నివారం నిజామాబాద్ లో జ‌రిగే స‌మావేశానికి హాజ‌రు కావ‌టానికి కోదండం మాష్టారు శుక్ర‌వారం అర్థ‌రాత్రి బ‌య‌లుదేశారు. ఇదిలాఉండ‌గా కోదండం మాష్టార్ని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో తూప్రాన్ లో శుక్ర‌వారం నుంచే 144సెక్ష‌న్ ను విధించారు. హైవే 44పై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వ‌ద్ద జిల్లా ఏఎస్పీ రాంచంద్రారెడ్డి అధ్వ‌ర్యంలో తెల్ల‌వారుజాము నుంచే మెద‌క్ జిల్లాతో పాటు.. కామారెడ్డి.. నిజామాబాద్ జిల్లాల పోలీసుల్ని తుప్రాన్ లో భారీగా మోహ‌రించారు. కోదండం మాష్టారు టోల్ ప్లాజా వ‌ద్ద‌కు చేరుకున్న వెంట‌నే.. ఆయ‌న వాహ‌నాన్ని భారీగా పోలీసులు చుట్టుముట్టారు.

దీంతో ఆయ‌న వెంట ఉన్న టీజేఏసీ నేత‌లు ఆందోళ‌న‌ల‌కు దిగ‌గా.. వారిని అరెస్ట్ చేసి.. బ‌ల‌వంతంగా వ్యాన్ల‌లో త‌ర‌లించారు. అదేస‌మ‌యంలో కోదండం మాష్టార్ని అరెస్ట్ చేసి న‌ర్సాపూర్ మీదుగా కౌడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. పోలీస్ స్టేష‌న్లో కొద్ది సేపు ఉంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. సెక్ష‌న్ 144 ఉన్న నేప‌థ్యంలో కోదండం తో పాటు 29 మంది టీజేఏసీ నాయ‌కుల‌పై 151 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉండ‌గా..టోల్ ప్లాజా వ‌ద్ద కోదండ‌రాం ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ఢీ కొని మెద‌క్ డీఎస్పీ నాగ‌రాజు గాయ‌ప‌డ్డారు. దీంతో.. కోదండ‌రాం డ్రైవ‌ర్ పైనా కేసు న‌మోదు చేశారు. లాస్ట్ బ‌ట్ నాట్ లీస్ట్ ముచ్చ‌ట ఏమిటంటే.. నిజామాబాద్ లో స‌భ‌కు అనుమ‌తి ర‌ద్దు చేయ‌ట‌మే కాదు.. హాల్ మీటింగ్ పెట్టుకుంటామ‌ని నిర్వాహ‌కులు కోరినా అనుమ‌తి ఇచ్చేందుకు పోలీసులు స‌సేమిరా అన్న‌ట్లుగా చెబుతున్నారు. తాజా ప‌రిణామాల‌పై కోదండ‌రాం తీవ్ర అసంతృప్తిని.. ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News