కరోనాతో టీఎంసీ అభ్యర్థి మృతి.. ఈసీపై హత్యకేసు పెట్టిన ఆయన భార్య

Update: 2021-04-29 03:06 GMT
ఇలాంటి కరోనా కల్లోలం వేళ ఐదురాష్ట్రాల ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్ పై ఇటీవల మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారిపై హత్య కేసు పెట్టాలని ఆదేశించింది.  ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో పోటీచేసిన ఓ అభ్యర్థి సైతం కరోనాతో చనిపోయాడు. దీంతో ఆయన భార్య ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టింది.

బెంగాల్ లోని ఖర్గా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా కాజల్ సిన్హా బరిలో నిలిచారు. ప్రచారంలో ఉండగానే కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రి పాలయ్యారు. ఏప్రిల్ 25న పరిస్థితి విషమించి మరణించారు.

దీంతో ఆయన భార్య నందితా సిన్హా తన భర్త చావుకు ఎన్నికల కమిషనర్ సందీప్ జైన్ తోపాటు ఇతర ఎన్నికల కమిషన్ అధికారులు కారణమని.. వారిపై హత్య కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ నందిత సిన్హా బుధవారం స్వయంగా ఖార్గా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలిసి కూడా ఎన్నికలను ఒకే దశలో నిర్వహించకుండా తన భర్తను బలిగొన్నారని.. అందుకు ఈసీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.

బెంగాల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివిధ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు చనిపోయారు.  కాజల్ సిన్హా కూడా ప్రస్తుత ఖద్గా స్థానానికి టీఎంసీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు.
Tags:    

Similar News