వైసీపీ నుండి నేతలను ఆకర్షించాలట

Update: 2021-08-12 06:30 GMT
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచిత్రమైన సలహా ఇచ్చారు. ఏపిలో కాంగ్రెస్ బలోపేతానికి వైసీపీ నుండి నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి ఆకర్షించాలట. ఎందుకంటే వైసీపీలో చాలా మంది నేతలు కాంగ్రెస్ లో నుండి వెళ్లిన వాళ్ళే కాబట్టి తిరిగి వాళ్ళందరినీ రప్పించాలని రాహుల్ భేటీలో నేతలకు చెప్పటమే విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఏడు మంది సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో పళ్ళంరాజు, కిరణ్ కుమార్ రెడ్డి, చింతామోహన్, శైలజానాద్, జేడీ శీలం, హర్షకుమార్, కేవీపీ రామచంద్రరావుతో రాహుల్ విడివిడిగా భేటీ అయ్యారు. నేతలు రాహుల్ కు ఏమి చెప్పారో తెలియదు కానీ రాహుల్ చెప్పింది విని అందరూ ఆశ్చర్యపోయారు సమాచారం. పార్టీ బలోపేతానికి వైసీపీలో చేరిన నేతలందరినీ తిరిగి ఆకర్షించాలని గట్టిగా రాహుల్ చెప్పారట.

అయితే వాళ్ళకి ఏ విధంగా ఆకర్షించాలి ? వైసీపీలో నుండి నేతలు తిరిగి కాంగ్రెస్ లోకి ఎందుకు వస్తారు ? అని మాత్రం రాహుల్ చెప్పలేదట. ఇక్కడే రాహుల్ అజ్ఞానం బయటపడుతోంది. కాంగ్రెస్ లో నుండి వైసీపీలోకి లేదా టీడీపీలోకి నేతలు వెళ్ళిపోయిందే తమ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదని. రాష్ట్ర విభజన సమయంలో అధిష్టానం చేసిన అడ్డగోలు విభజన కారణంగా జనాలు కాంగ్రెస్ పార్టీని పదడుగుల గొయ్యి తవ్వి పాతేశారు. 2014 ఎన్నికల్లో అంతకన్నా ముందు జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఈ విషయం రుజువై పోయింది.

అందుకనే 2014 ఎన్నికలైపోగానే క్షేత్రస్ధాయిలో బలమున్న నేతల్లో చాలామంది వైసీపీలోను మరికొందరు టీడీపీలోకి వెళ్ళిపోయారు. 2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బకు టీడీపీనే దిక్కు తెలియకుండా పడుంది. ఇక భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ లోకి నేతలు తిరిగి వస్తారని రాహుల్ ఎలా అనుకున్నారో అర్థం కావట్లేదు. పైగా 2024 కల్లా కాంగ్రెస్ పుంజు కోవాలని నేతలకు రాహుల్ ఆదేశాలివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. రాహుల్ ఆదేశాలతో క్షేత్రస్థాయి వ్యవహారాలపై రాహుల్ కు ఎలాంటి అవగాహన లేదని అర్థమైపోయింది.



దళితులు, ఆదివాసీలు, దళిత క్రిస్తియన్లు, బీసీలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని నేతలకు గట్టిగా చెప్పారట. రాహూల్ చెప్పిన వర్గాలన్నీ గడచిన పదేళ్ళుగా వైసీపీ తోనే ఉన్నాయి. రాహుల్ మొత్తం మీద చూస్తే ఏపి పరిస్థితులపై రాహుల్ ఎలాంటి అవగాహన లేదని అర్థమైపోయింది. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ కు ఏపిలో బతుకన్నదే లేదని రాహుల్ కు నేతలు చెప్పారో లేదో తెలీదు. విచిత్రమేమిటంటే భేటీకి రమ్మని నేతలను పిలిచిన రాహుల్ అందరితో ఒకేసారి ఎందుకు భేటీకాలేదో అర్థం కావటంలేదు.


Tags:    

Similar News