మొత్తానికి జగన్ సాధించాడు

Update: 2021-06-15 04:30 GMT
గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన నియామకాలపై కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయింది. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన నాలుగు ఎంఎల్సీ స్ధానాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాలుగు పేర్లను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు సిపారసు చేసింది. సిఫారసు చేసి చాలా కాలమైనా ఆ ఫైల్ గవర్నర్ కార్యాలయంలోనే ఉండిపోయింది. దాంతో సిఫారసుచేసిన నాలుగు పేర్లలో రెండు పేర్లపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని, అందుకనే సంతకం చేయలేదని జగన్ వ్యతిరేక మీడియా ఊదరగొట్టింది.

గుంటూరుకు చెందిన లేళ్ళ అప్పిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలోని తోట త్రిమూర్తులు, కడపకు చెందిన రమేష్ యాదవ్, పశ్చిమగోదావరికి చెందిన మోషేన్ రాజు పేర్లను జగన్ ప్రతిపాదించారు. వీరిలో తోట త్రిమూర్తులు, లేళ్ళ అప్పిరెడ్డిపై కేసులున్న కారణంగా  గవర్నర్ అభ్యంతరాలు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ప్రచారమంతా ఉత్త ప్రచారంగా మాత్రమే  తర్వాత తేలిపోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నేతలపై కేసులున్న కారణంగా వాళ్ళకు పదవులు ఇవ్వకూడదనుకుంటే కష్టమే. ఎందుకంటే చాలామంది నేతలపై ఏదో ఒక కేసు ఉంటుందనటంలో సందేహంలేదు. ఇక్కడ తోట, అప్పిరెడ్డిపైన కేసులున్న మాట వాస్తవమే. తోటపై ఉన్న కేసు దాదాపు 30 ఏళ్ళుగా విచారణ సాగుతునే ఉంది. ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలీదు. అంతమాత్రాన ఆయన్ను పదవులు తీసుకోకూడదంటే సాధ్యంకాదు.

ఇదే విషయమై చర్చించి పేర్లపై ఆమోదముద్ర వేయించుకునేందుకే గవర్నర్ ను జగన్ సోమవారం కలవబోతున్నారనే ప్రచారం పెరిగిపోయింది. అయితే జగన్ భేటీకి ముందే గవర్నర్ నాలుగుపేర్లపైన ఆమోదముద్ర వేసేశారు. నిజానికి ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపక గవర్నర్ కు వేరే మార్గంలేదు. ఒకసారి తిరస్కరించిన ఫైల్ ను ప్రభుత్వం రెండోసారి కూడా పంపితే ఆమోదం తెలపాల్సిందే. పైగా గవర్నర్-జగన్ మధ్య మంచి సంబంధాలే ఉన్న కారణంగా ఫైల్ ను తిరస్కరించే అవకాశం కూడా లేదు. ఆ విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.
Tags:    

Similar News