ప్రశ్నలు 40 వేలు.. జవాబులు ఆరే

Update: 2015-09-28 03:49 GMT
ప్రధాని మోడీకి ఎంత క్రేజ్ ఉంది. ఆయన సమాధానాలు ఇస్తానంటే ప్రశ్నలు అడిగే వారు ఏ స్థాయిలో ఉంటారు? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో ఆయన.. ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ తో సమావేశమై.. ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని చెప్పటం తెలిసిందే. ఇందుకోసం ఇష్టం ఉన్న వారు ప్రశ్నలు అడగొచ్చని.. ఆ ప్రశ్నల్ని తమకు పంపాలని ప్రకటించిన విషయం తలిసిందే.

జుకర్ బర్గ్ చేసిన ప్రకటనకు స్పందించి.. మోడిని ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమైన వారు వేలాది మంది ఉన్నారు. 40వేల ప్రశ్నలు మోడీ అడిగేందుకు సిద్ధం చేశారు. అయితే.. మోడీ మాత్రం ఆరంటే ఆరు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వీటిల్లో రెండు ప్రశ్నలు జుకర్ బర్గ్ సంధించినవే కావటం గమనార్హం.

ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో తనకున్న విజన్ గురించి చెప్పటంతో పాటు.. తనకేం కావాలన్న విషయాన్ని మోడీ విస్పష్టంగా చెప్పేశారు. తాను అమెరికా పర్యటనకు వెళ్లిన ఉద్దేశాన్ని ఆయన ఎంతమాత్రం మర్చిపోలేదు. భావోద్వేగంలో ఉన్నప్పుడు కూడా బాధ్యతను మర్చిపోలేదు. తల్లిదండ్రుల విషయానికి వచ్చినప్పుడు తన తల్లి కష్టాన్ని గుర్తు చేసుకున్న సందర్భంలోనే.. జుకర్ బర్గ్ తల్లిదండ్రుల్ని నాటకీయంగా సభకు పరిచయం చేస్తూనే.. ప్రపంచానికి వారికి మరింత సుపరిచితం చేసే ప్రయత్నం చేశారు.

ఇలాంటి నాటకీయ పరిణామాలతో పాటు.. భారత ఆర్థిక వ్యవస్థకు తాను ఎలాంటి శస్త్ర చికిత్స చేయాలన్న విషయాన్ని తెలియజెప్పటంతో పాటు.. తన ఆశను.. ఆశయాన్ని వెల్లడించారు. భారత్ ను ఇప్పుడున్న దానికి భిన్నంగా 1300లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న తన ఆలోచనను చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆర్థిక మాంద్యంతో సంబంధం లేకుండా తమ దేశంలోకి వచ్చే పెట్టుబడుల వృద్ధిరేటు 40 శాతం ఉందంటూ తమ ప్రభుత్వానికి మంచి మార్కులు పడేలా మాట్లాడారు.

అంతేకాదు.. ప్రపంచంలో డబ్బుకి కొదవలేదని.. కానీ, ఎక్కడ దాచుకోవాలన్న దానిపై సమస్య ఉందని.. అందుకే తాను భారత్ లో పెట్టబడులు పెట్టమని చెబుతున్నట్లు వెల్లడించారు. భారత్ మార్కెట్ పెట్టుబడులకు సురక్షితమైనదని చెప్పిన ఆయన తనకెంతో ఇష్టమైన డిజిటల్ లోని మొదటి అక్షరం ‘‘డి’’కి సరికొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.

దేశంలోని మూడు ‘‘డీ’’లకు నాలుగో డి తాను చేరుస్తున్నట్లు చెప్పిన మోడీ.. ‘‘డెమో గ్రఫీ (జనాభా).. డెమోక్రసీ (ప్రజాస్వమ్యం).. డిమాండ్ (గిరాకీ)తో పాటు.. డీ రెగ్యులేషన్ (నియంత్రణ ఎత్తివేత) కూడా తమ సర్కారు పాటిస్తుందని చెప్పకనే చెప్పేశారు. విదేశీ పెట్టబడుల విషయంలో అమెరికా తమకెంత ముఖ్యమన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. గడిచిన 15 నెలల వ్యవధిలో అమెరికా నుంచి వచ్చే ప్రత్యక్ష పెట్టబడులు 87శాతం పెరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తనను ఏం అడగాలన్న విషయాల్ని వదిలేసి.. తాను చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పేసి మోడీ తనదైన మార్క్ వైఖరిని ప్రదర్శించారని చెప్పొచ్చు.
Tags:    

Similar News