టీపీసీసీ చీఫ్ ఎంపిక: జీవితకాలం లేట్ యేనా?

Update: 2021-06-15 06:36 GMT
అందరికంటే దురదృష్టవంతులు ఎవరయ్యా అంటే ఠక్కున సమాధానం చెప్తారు.. వాళ్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలేనని.. ఎందుకంటే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ గత ఐదేళ్లు కొన‘సాగుతూనే’ ఉంటోంది. పీసీసీ ఉత్తమ్ ను మార్చి కొత్త నేతను పెట్టేస్తున్నామని ప్రచారం జరగడం.. మళ్లీ వాయిదాపడడం జరుగుతూనే ఉంది.

మొన్నటికి మొన్న ఫిబ్రవరిలో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖాయమన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వరకు ఆగాలని జానారెడ్డి సూచించడంతో అధిష్టానం ఆపేసిందన్నారు. ఇప్పుడు ఆ ఎన్నిక ముగిసింది. మళ్లీ పీసీసీ చీఫ్ నియామకం అయిపోయిందని.. రేవంత్ ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. అయినా కూడా మళ్లీ నియామకం ఆగిపోయింది.

మొన్న కేరళలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే అక్కడి పీసీసీ చీఫ్ ను మార్చేశారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీపరమైన సమస్యల పరిష్కారానికి ఏదో ఒకటి చేస్తున్నప్పటికీ తెలంగాణ విషయంలో మాత్రం నాన్చివేత ధోరణి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆశానిపాతం అవుతోంది.

ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అని ప్రకటించడం.. ఆయన వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు గళమెత్తడంతో మళ్లీ సంసారం మొదటికొచ్చింది.

తాజాగా పీసీసీ కార్యవర్గ సభ్యులంతా ఢిల్లీకి చేరారు. తీరా ఇప్పుడు మళ్లీ హైకమాండ్ ఇంకాస్త ఆలోచిస్తామని చెప్పడంతో అందరి ముఖాల్లో నెత్తురు చుక్క కరువైందట.. ఓ వైపు రేవంత్.. మరోవైపు ఇతర కాంగ్రెస్ సీనియర్ల లాబీయింగ్ తో పార్టీ ఏమవుతుందోన్న ఆందోళనతో హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోందట.. చూస్తుంటే టీపీసీసీ చీఫ్ నియామకం జీవితకాలం లేట్ అవుతుందేమోనని కాంగ్రెస్ నేతలు నిట్టూరుస్తున్నారట..
Tags:    

Similar News