గవర్నర్ వర్సెస్ కేసీఆర్.. పెట్రోల్ పోసిన రేవంత్ రెడ్డి

Update: 2022-04-08 14:31 GMT
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. ‘సెక్షన్ 8’ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు.  తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న పంచాయతీలో పెట్రోల్ పోశాడు.  గవర్నర్, టీఆర్ఎస్ నేతలు తప్పు మీదంటే మీదని దుమ్మెత్తిపోసుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతల వాదన ఇలా ఉంటే.. తాజాగా ఈ అంశంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  సెక్షన్ 8 పరిధిలో ఉన్నా ఏ అంశంపైనైనా గవర్నర్ ఫైనల్ చేయొచ్చని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేటీఆర్ ను సీఎం చేయాలనే ఒత్తిడిని తట్టుకోలేకనే కేసీఆర్ ఇలా గవర్నర్ తో వివాదాలను పైకి లేపాడని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ తో సఖ్యత లేని కారణంగా కేటీఆర్ ను సీఎం చేయడం లేదని కుటుంబ సభ్యులతో కేసీఆర్ చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో సమస్యల్ని గవర్నర్ గుర్తించారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు గవర్నర్ ఏమైనా చేయవచ్చని గుర్తు చేశారు. గ్రేటర్ పరిధిలో ఏమైనా సమీక్ష చేసే అధికారం గవర్నర్ కు ఉందని అన్నారు. విద్య, వైద్యం, డ్రగ్స్ పై గవర్నర్ సమీక్ష చేయవచ్చని కామెంట్ చేశారు. గవర్నర్ అధికారాలు ఉపయోగించి అన్నింటిని సరిదిద్దాలని తెలిపారు. సెక్షన్ 8 ప్రకారం.. రాజ్యాంగం గవర్నర్ కు విశేష అధికారాలు ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డి గతంలో వివాదాస్పదమైన సెక్షన్ 8 అంశాన్ని  ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విభజన చట్టంలో గవర్నర్ కు ప్రత్యేకాధికారాలు కల్పించారు.

సెక్షన్ 8(2) ప్రకారం.. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల రక్షణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపులపై గవర్నర్ కు బాధ్యతలను కట్టబెట్టారు. గతంలో సెక్షన్ 8 అమలు చేయాలనే ప్రస్తావన వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కేంద్రానికి స్పష్టం చేసింది.

సెక్షన్ 8 అమలుచేసే పరిస్థితులు హైదరాబాద్ లో లేవని కేంద్రం అప్పట్లో చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
Tags:    

Similar News