న‌మ్ముకున్న నేత‌ను న‌ట్టేట వ‌దిలేసిన రేవంత్‌..!

Update: 2022-05-25 01:30 GMT
న‌మ్ముకున్న నేత‌ను రేవంత్ న‌ట్టేట వ‌దిలేశారా..? ఆది నుంచీ అండ‌గా నిల‌బ‌డ్డ నాయ‌కుడు అభాసుపాలవుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదా..? పార్టీ సీనియ‌ర్ల ఆగ్ర‌హంతో సిన్సియ‌ర్ లీడ‌ర్ కు హ్యాండిస్తున్నారా..? గ్రూపు రాజ‌కీయాల గొడ‌వ‌ల‌తో ఆ నేత‌ను వ‌దిలించుకునేందుకే సిద్ధ‌ప‌డ్డారా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి. ఆయ‌న ఎవ‌రో కాదు.. రేవంత్ స‌న్నిహితుడు అద్దంకి ద‌యాక‌ర్‌.

అద్దంకి ద‌యాక‌ర్ తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. మ‌రోసారి పోటీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. అయితే సీనియ‌ర్లు గ్రూపు రాజ‌కీయాల‌తో ద‌యాక‌ర్ కు పొగ పెడుతున్నారు. మ‌రో నేత‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌, మాజీ మంత్రి దామోద‌ర్ రెడ్డి స‌న్నిహితుడు వ‌డ్డేప‌ల్లి ర‌వికి టికెట్ ఇప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో గ్రూపు రాజ‌కీయాలు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయి. తాజాగా ద‌యాక‌ర్‌పై దాడి చేసే వ‌ర‌కు వెళ్లాయి.

తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఒక‌పుడు బి నాగిరెడ్డి, మల్లు స్వ‌రాజ్యం వంటి మ‌హామ‌హులు ప్రాతినిథ్యం వ‌హించారు. 1985 నుంచి ఆ స్థానం కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లింది. రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి ఇక్క‌డి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప‌లు మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టారు. మ‌ధ్య‌లో రెండుసార్లు మాత్ర‌మే టీడీపీ నుంచి సంకినేని వెంక‌టేశ్వ‌ర్ రావు, మోత్కుప‌ల్లి న‌ర్సింలు విజ‌యం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కు ఆ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా ఉంది.

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ‌డంతో ఈ స్థానం టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లింది. విద్యార్థి నేత గ్యాద‌రి కిషోర్ ఇక్క‌డి నుంచి రెండుసార్లు గెలుపొందారు. ముచ్చ‌ట‌గా మూడోసారి పోటీకి ఆస‌క్తి చూపుతున్నారు. అయితే రెండు సార్లు కిషోర్ స్వ‌ల్ప తేడాతోనే గెలిచారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి అద్దంకి ద‌యాక‌ర్ గ‌ట్టి పోటీ ఇచ్చారు. తాను రెండు ద‌ఫాలు స్వ‌ల్ప తేడాతో ఓడిపోవ‌డానికి కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌, మాజీ మంత్రి దామోద‌ర్ రెడ్డి కార‌ణ‌మ‌ని ద‌యాక‌ర్ ఆరోపిస్తున్నారు.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌ను అద్దంకి ద‌యాక‌ర్ మొద‌టి నుంచీ వ్య‌తిరేకిస్తూనే వ‌స్తున్నారు. ఒక్కో నాయ‌కుడు రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను అదుపులో ఉంచుకొని ప‌నిచేసే నాయ‌కుల‌ను అణ‌గ‌దొక్కుతున్నార‌ని విమ‌ర్శించారు. దీనిపై అస‌మ్మ‌తి నేత‌ల‌తో ఇటీవ‌ల ప్ర‌త్యేక స‌మావేశం కూడా నిర్వ‌హించారు. ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు అండ‌గా ఉన్న ద‌యాక‌ర్ ఆది నుంచీ రేవంతుకు స‌న్నిహితంగానే మెలిగారు. టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రావ‌డం ద‌గ్గ‌ర నుంచీ ఇటీవ‌ల వ‌ర‌కు ఆయ‌న‌కు మ‌ద్దతుగానే నిలిచారు. ప‌లు బ‌హిరంగ స‌భ‌ల్లో కాబోయే సీఎం రేవంతేన‌ని స్ప‌ష్టం చేశారు. సీనియ‌ర్లు వ్య‌తిరేకించినా నాగార్జున సాగ‌ర్ లో రేవంత్ స‌మావేశం పెట్టించేలా కృషి చేశారు.

అయితే.. ఈ మ‌ధ్య కాలంలో రేవంతుకు, అద్దంకికి చెడింద‌ని పార్టీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. సీనియ‌ర్ల‌ను విమ‌ర్శించినందుకు ద‌యాక‌ర్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వ‌డంతో ఆయ‌న ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌. అలాగే రెండు రోజుల క్రితం తుంగతుర్తిలో ఒక వివాహ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అద్దంకిపై దామోద‌ర్ రెడ్డి స‌న్నిహితులు దాడి చేశార‌ట‌. దీన్ని రేవంత్ ఖండించ‌క‌పోగా.. క‌నీసం ప‌ల‌క‌రించ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ తీవ్ర మ‌న‌స్తాపం చెందార‌ట‌. రేవంతును న‌మ్ముకుంటే త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌. పార్టీలో కొన‌సాగే విష‌య‌మై ఆలోచిస్తున్నార‌ట‌. రేవంత్ త‌న స‌న్నిహితుడిని ఆదుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News