రాజ్ నాథ్ కు కశ్మీరీలు అలా షాకిచ్చారా?

Update: 2016-07-24 05:24 GMT
ప్రముఖులు ఎవరైనా వస్తే.. వారితో మాట్లాడేందుకు.. తమ సమస్యల గురించి చెప్పుకోవటం కోసం విపరీతమైన ఆసక్తిని చూపించటం చూస్తాం. ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తికే ఇలాంటి అనుభవం ఉంటే.. ఏకంగా కేంద్ర హోం మంత్రికి ఇంకెంత స్పందన ఉండాలి. కానీ.. తాజాగా కశ్మీర్ లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఊహించని షాక్ తగిలింది.

హిజ్ బుల్ ముజాహిదిన్ తీవ్రవాదిన బుర్హన్ వని ఎన్ కౌంటర్ లో హతమైన నేపథ్యంలో కశ్మీర్ వ్యాలీలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ గొడవల కారణంగా పెద్ద ఎత్తున కాశ్మీరీలు మరణించటంతో పాటు.. దాదాపు 2వేల మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. కశ్మీరీలతో పాటు.. భద్రతా సిబ్బంది కూడా మరణించటం.. గాయపడిన విషయాన్ని మర్చిపోకూడదు. దేశాన్ని కుదిపేసిన ఈ అల్లర్ల అంశాన్ని సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కశ్మీరీ వ్యాపారుల్ని కలుసుకునేందుకు.. వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు.

ఊహించని విధంగా ఆయనతో మాట్లాడేందుకు వారు ఇష్టపడకపోవటం షాకింగ్ గా మారింది. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించిన రాజ్ నాథ్.. పారా మిలటరీ.. సీఆర్ పీఎఫ్.. ఐటీబీపీ డీజీపీతో కలిసి అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సందర్భంగా.. అక్కడి వారు రాజ్ నాథ్ తో మాట్లాడేందుకు ఆసక్తి ప్రదర్శించకపోవటం ఆయనకిది ఊహించని పరిణామంగా మారిందని చెబుతున్నారు. మరి..కేంద్ర హోం మంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా వచ్చి.. సమస్యలు ఏమిటని అడిగితే.. మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించకపోవటం మామూలు పరిణామం కాదు కదా..?
Tags:    

Similar News