ట్రాన్స్ జెండర్లకు తొలి గౌరవం

Update: 2016-06-06 10:59 GMT
అప్పుడెప్పుడో అన్నగారు ఎన్టీరామారావు ''లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.." అంటూ మొదలు పెట్టి ''అది ఇది కాదని అన్ని రంగములా మగధీరులనెదిరించారు" అని గొంతెత్తి పాడుతూ మహిళాభ్యుదయం గురించి తన సినిమాలో పాటలు పాడారు. మహిళలు వెనుకబాటుతనం నుంచి బయటపడుతున్న తొలినాళ్లవి... అన్నగారు కలలు కన్నట్లుగా ఇప్పుడు మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మూడో జెండర్ అభ్యుదయం గురించి మాట్లాడుతున్న రోజులివి. భారత దేశం కూడా అందుకు మినహాయింపు కాదు.. ఇక్కడ వారి ప్రగతి మొదలవుతోంది. ఉద్యోగాలు - వ్యాపారాలు - సామాజిక సేవలో ముందుంటున్న ట్రాన్సుజెండర్లు రాజకీయాల్లోనూ అక్కడక్కడా రాణిస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో వారు స్త్రీపురుషులతో సమానంగా ప్రగతి సాధించలేకపోతున్నారు. చాలాచోట్ల వారికి దక్కుతున్న గౌరవం కూడా తక్కువే. కానీ... తాజాగా దేశంలో తొలిసారిగా ఒక ట్రాన్సుజెండర్ కు అరుదైన గౌరవం దక్కింది. అవును.... దేశంలో తొలిసారిగా ఒక ట్రాన్స్ జెండర్ ను గౌరవ డాక్టరేట్ తో సన్మానించారు.

ఇండియన్ వర్చువల్ యూనివర్శిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ (ఐవీయూపీ) సంస్థ నుంచి సామాజిక కార్యకర్త, ట్రాన్స్ జెండర్ అక్కై పద్మశాలి డాక్టరేట్ అందుకున్నారు. ఇలా గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి ట్రాన్సు జెండర్ అక్కై కావడం విశేషం. తనకు డాక్టరేట్ వస్తుందని ఊహించలేదని, ఈ గౌరవం తనకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని అక్కై చెబుతున్నారు.  తనకు డాక్టరేట్ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించినప్పుడు, పదో తరగతి ఫెయిలైన తనకు ఎలా ఇస్తున్నారనే అనుమానం వచ్చిందన్నారు. అయితే, సామాజిక కార్యకర్తగా ట్రాన్స్ జెండర్లకు సేవలందిస్తున్నందుకు గానూ డాక్టరేట్ ఇస్తున్నామని ఐవీయూపీ పేర్కొనడంతో తన డౌట్ క్లియర్ అయిందని ఆమె చెప్పారు. కాగా, ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న పద్మశాలి, అక్కడ తనలాంటి వారికి సేవలందిస్తోంది. మొత్తానికి భారత దేశం అన్ని వర్గాలనూ సమానంగా ఆదరిస్తుందని.. గౌరవిస్తుందని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదేమో?
Tags:    

Similar News