హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి ‘ఆమె’ను దించిన కేసీఆర్

Update: 2021-02-22 04:19 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు అనూహ్యంగా ఉంటాయి. అప్పటివరకు వెనక్కి తగ్గుతున్నట్లుగా వ్యవహరిస్తూ.. ఆఖరి నిమిషంలో తెర మీదకు రావటం చేస్తుంటారు. తాజాగా అలాంటి వ్యూహాన్ని మరోసారి అమలు చేశారు గులాబీ బాస్. హైదరాబాద్.. రంగారరెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవిని బరిలోకి దించుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకు ఈ స్థానానికి పలువురు ఆశావాహుల పేర్లు వినిపించినప్పటికి.. కేసీఆర్ ఎంపిక మాత్రం వినూత్నంగా మారింది. పీవీ సెంటిమెంట్ తో పాటు.. పట్టభద్రుల ఓటర్లకు పెద్ద పరీక్షే పెట్టారని చెప్పాలి. ఈ రోజు (సోమవారం) ఆమె నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే నల్గొండ-వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీపల్లా రాజేశ్వరరెడ్డిని ప్రకటించటం.. ఆయనకు బీ ఫారం ఇవ్వటం జరిగింది.

ఇక..హైదరాబాద్ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని కేటాయించేందుకు సీఎం కేసీఆర్ భారీ కసరత్తు చేసినట్లుగా చెబుతారు. పార్టీ నేతలతో పెద్ద ఎత్తున చర్చలు జరిపిన అనంతరం వాణీదేవిని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. వంగరలో 1952లో జన్మించిన ఆమె.. ఉస్మానియా వర్సిటీ నుంచి బీఏ.. జేఎన్ టీయూ నుంచి ఫైన్ ఆర్ట్ శాఖలో పూర్తి చేశారు. 1990-95 మధ్య జేఎన్ టీయూ అధ్యాపకురాలిగా వ్యవహరించిన ఆమె 1997-2008 మధ్య కాలంలో వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు అధ్యాపకురాలిగా పని చేశారు.

ఇటీవల కాలంలో దివంగత మాజీ ప్రధాని పీవీకి పెద్ద పీట వేయటం తెలిసిందే. ఆయన జయంత్యుత్సవాలను గత జూన్ 26న ఘనంగా నిర్వహించిన కేసీఆర్.. ఆయన కుమార్తెను తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి దించటం ద్వారా.. పీవీ పరువును కాపాడాల్సిన బాధ్యతను హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న వారి మీద కేసీఆర్ పెట్టారని చెప్పక తప్పదు. మరి..దీనికి వారేమని తీర్పు ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News