కేసీఆర్ క‌ల‌కు జైకొట్టిన కొత్త స‌ర్వే

Update: 2019-01-06 07:07 GMT
ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు మ‌రో తీపి క‌బురు ద‌క్కింది. ఆయ‌నకు క‌ల సాకారం కానుంద‌నే రీతిలో తాజాగా ఓ స‌ర్వే తెర‌మీద‌కు వ‌చ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకే విజయం కట్టబెడుతారని వీడీపీ అసోసియేట్స్ తాజా సర్వే వెల్లడించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఏకపక్షంగా తీర్పునివ్వనున్నారని సర్వే స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా.. అందులో 16 స్థానాలను టీ ఆర్‌ ఎస్ కైవసం చేసుకుంటుందని తెలిపింది. మిగిలిన హైదరాబాద్ లోక్‌ సభ స్థానాన్ని ఎప్పటిలాగే ఎంఐఎం పార్టీ గెలుచుకుంటుందని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రజలు టీ ఆర్‌ ఎస్‌ ను అక్కున చేర్చుకోవడానికి అనేక కారణాలున్నాయని, 57 ఏళ్ల‌ కాంగ్రెస్, టీడీపీ పాలనకంటే నాలుగున్నరేండ్ల సీఎం కేసీఆర్ పాలన మెరుగ్గా ఉన్నదని ప్రజలంతా భావిస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని పేర్కొంది.

ఈ ఏడాది జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో ఏయే పార్టీకి ఎంత శాతం ఓట్లు పోలవుతాయనే విషయంలోనూ వీడీపీ అసోసియేట్స్ చేసిన సర్వేలో స్పష్టత వచ్చింది. టీ ఆర్‌ ఎస్‌ కు దాదాపు 44.4 శాతం ఓట్లు పోలవుతాయని వెల్లడించింది. 2014 ఎన్నికల్లో 11 లోక్‌ సభ స్థానాలు గెలుచుకున్న టీ ఆర్‌ ఎస్‌ లో వైసీపీనుంచి గెలుపొందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మల్కాజిగిరిలో టీడీపీ నుంచి గెలిచిన చామకూర మల్లారెడ్డి టీ ఆర్‌ ఎస్‌ లో చేరారు. దీంతో లోక్‌ సభ లో టీ ఆర్‌ ఎస్ బలం 14కు పెరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్‌ కు 31 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తేల్చిన సర్వే... ఒక్క సీటు కూడా గెలిచే అవకాశమే లేదని పేర్కొంది.

తెలంగాణ ప్రజలు పూర్తిగా తిరస్కరించిన బీజేపీ 11.4 శాతం ఓట్లను పొందుతుందని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన సికింద్రాబాద్ స్థానాన్ని ఈసారి కోల్పోయి చతికిలపడే అవకాశముంది. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకొనే ఆనవాయితీని ఎంఐఎం ఈసారి కూడా కొనసాగిస్తుందని తెలిపింది. మజ్లిస్‌ కు ఈసారి దాదాపు 4 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే తెలిపింది. రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో వామపక్షాల చిరునామా గల్లంతయ్యే అవకాశమున్నదని వీడీపీ తాజా సర్వేలో స్ప‌ష్ట‌మైంది. సీపీఐ, సీపీఎంకు చెరో 0.5 శాతం, కోదండరాం పార్టీ టీజేఎస్‌ కు 0.4 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ప్రతిపక్షాలు కూకటివేళ్లతోసహా కుప్పకూలనున్నాయని గులాబీ వ‌ర్గాలు ఖుష్ అవుతున్నాయి.






Full View
Tags:    

Similar News