టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్.. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా?

Update: 2022-12-15 04:03 GMT
అవును.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కాస్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారింది. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలన్ని పూర్తి అయ్యాయి. మారిన పార్టీ పేరు.. మారిన పార్టీ జెండాను కేసీఆర్ సారు చూపించి చాలా కాలమే అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకోవటం.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేయటం తెలిసిందే. తన మార్కుతో కూడిన పూజలతో పార్టీ కార్యాలయాన్ని వైభవంగా పూర్తి చేశారు కేసీఆర్. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఇవాల్టి రోజున ఏదైనా మార్పు చేసినంతనే ఆ విషయాన్ని సోషల్ ప్రపంచంలోనూ మార్చుకోవాల్సి ఉంటుంది.

అన్నింట్లోనూ ముందుచూపును ప్రదర్శించే కేసీఆర్ మాష్టారు.. సోషల్ మీడియాలో తన పార్టీ పేరు మార్పు విషయంలో మాత్రం వెనుకపడ్డారనే చెప్పాలి. ఎవరెన్ని చెప్పినా.. ఇవాల్టి రోజున ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది మాత్రం సోషల్ మీడియానే.

అందులో జరిగే పరిణామాలు వార్తాంశాలుగా మారటమే కాదు.. గమనాన్ని మార్చేస్తున్న పరిస్థితి. అంతటి కీలక భూమిక పోషించే సోషల్ మీడియాలో ఒక్క ట్విటర్ ఖాతాలో మాత్రమే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అది కూడా బుధవారం మధ్యాహ్నం తర్వాతనే.

ఇప్పటికి కేటీఆర్ ఆఫీసు.. కేటీఆర్ వ్యక్తిగత ట్విటర్ ఖాతాను చూస్తే.. ఆయన టీఆర్ఎస్ నేతగా కనిపిస్తారే తప్పించి.. బీఆర్ఎస్ గా మాత్రం ప్రస్తావించటం కనిపించదు. కేటీఆర్ ఖాతానే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగిలిన వాటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. టీఆర్ఎస్ అధికారిక ట్విటర్ ఖాతాలో తప్పించి.. మరే సోషల్ మీడియా ఖాతాలోనే బీఆర్ఎస్ గా ప్రస్తావిస్తున్నది లేదు.

బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా అందరికి సుపరిచితం చేయాలన్న కేసీఆర్ ఆలోచన అయినప్పుడు.. సోషల్ ప్రపంచంలో ఆ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కదా అన్నది విషయం.

మరి.. ఈ మార్పులు ఎంత త్వరగా చేస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. బీఆర్ఎస్ అంటూ ఎవరైనా ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తే.. వారికి వచ్చే సమాధానం రెండుగా కనిపిస్తే కన్ఫ్యూజ్ అవుతారన్న విషయాన్ని మర్చిపోకూడదు.మరి.. ఈ విషయాన్ని గులాబీ బాస్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News