పాలేరు, కొల్లాపూర్ లో వాళ్లు అవుట్‌.. వీళ్లు ఇన్‌..?

Update: 2022-06-22 16:30 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మార‌బోతున్నాయా..? ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్ర‌ధాన మార్పులు చోటుచేసుకోబోతున్నాయా..? పాలేరు, కొల్లాపూర్ ప‌రిణామాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మా..? మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇక‌పై ఇదే జ‌ర‌గాల‌ని శ్రేణులు కోరుకుంటున్నాయా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

గ‌డ‌చిన కొద్ది రోజులుగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు, ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని కొల్లాపూర్ లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. క్రితం ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ ఒకే స్థానంలో గెలుపొందింది. ఖ‌మ్మం నుంచి పువ్వాడ అజ‌య్‌కుమార్ ఒక‌రే విజ‌యం సాధించారు. మిగ‌తా స్థానాల‌ను కాంగ్రెస్‌, టీడీపీ త‌మ ఖాతాల్లో వేసుకున్నాయి.

టీఆర్ఎస్ లో ఉన్న అస‌మ్మ‌తి, గ్రూపు రాజ‌కీయాలే ఓట‌మికి దారి తీశాయ‌ని ఇప్ప‌టికీ భావిస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న‌.. సీఎం కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడు అయిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా పాలేరు నుంచి ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. త‌ర్వాత రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌లో భాగంగా కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు కారెక్కారు. భ‌ట్టి, పొదెం వీర‌య్య మాత్ర‌మే కాంగ్రెసులో మిగిలారు.

ఇక అప్ప‌టి నుంచీ టీఆర్ఎస్ కు క‌ష్టాలు ఇంకా పెరిగాయి. కారు ఓవ‌ర్ లోడ్ అయిపోయి గ్రూపు రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌ని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌ల‌స ఎమ్మెల్యేలు ప్ర‌చారం చేసుకుంటున్నారు. దీంతో తుమ్మ‌ల‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పిడ‌మ‌ర్తి ర‌వి త‌ద‌తరులు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. కేవ‌లం వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న‌ల‌కే ప‌రిమితం అవుతున్నారు.

అలాగే.. పాల‌మూరు జిల్లా కొల్లాపూర్ లో కూడా ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. కాంగ్రెసు నుంచి వ‌చ్చిన వ‌ల‌స ఎమ్మెల్యే బీరం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి కూడా తిరిగి టికెట్ త‌న‌దేన‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జూప‌ల్లి కృష్ణారావు అల‌క‌బూనారు. ఇలా రాష్ట్రం మొత్తంమీద చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ప‌రిస్థితి ఉంది. ఇందులో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టికెట్ రాద‌ని భావిస్తున్న‌ చాలా మంది ఇత‌ర పార్టీల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండంతో అధిష్ఠానం అప్ర‌మ‌త్త‌మైంది.

స్వ‌యంగా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అసంతృప్తుల‌ను బుజ్జ‌గిస్తూ హామీలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా పాలేరు, కొల్లాపూర్ స్థానాల‌కు సంబంధించి తుమ్మ‌ల‌, జూప‌ల్లితో భేటీ అయిన కేటీఆర్ వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చార‌ట‌. అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్లు వారికే వ‌స్తాయ‌న్న ధీమాలో అభిమానులు ఉన్నారు. దీంతో పాలేరులో కందాళ‌, కొల్లాపూర్ లో బీరం ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!
Tags:    

Similar News