టీఆర్ఎస్ జోరు.. బీజేపీ బేజారు.. కాంగ్రెస్ సీనియ‌ర్ల మౌనం

Update: 2021-07-11 06:42 GMT
తెలంగాణ రాజ‌కీయాలు రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ప్ర‌ధాన పార్టీల్లో కీల‌క మార్పులు జ‌రిగిన నేప‌థ్యంలో..  ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయం వేడెక్కింది. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ భార‌తీయ జ‌న‌తా పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డంతో జోరందుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. ఇప్పుడు తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కం, కిష‌న్‌రెడ్డికి కేంద్ర కేబినేట్లో స్థానం ద‌క్క‌డం, ష‌ర్మిల కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌, తెలంగాణ‌ తెలుగు దేశం పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన ఎల్‌.ర‌మ‌ణ త్వ‌ర‌లోనే గులాబీ కండువా కప్పుకోనుండ‌డం.. ఇలా వ‌రుస కీల‌క ప‌రిణామాల‌తో రాష్ట్ర రాజ‌కీయం మాంచి థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది.

తెలంగాణ‌లో ఇటీవ‌ల ఎన్ని రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్న‌ప్ప‌టికీ.. అధికార పార్టీ టీఆర్ఎస్‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డే అవ‌కాశం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఆ పార్టీ ఎప్ప‌టిలాగే జోరు మీదుంది. ఈటెల పార్టీని వ‌ద‌లి.. బీజేపీలో చేరినా వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌నే అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈటెల రాజీనామాతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ఇప్ప‌టికే కేసీఆర్ పావులు క‌దుపుతున్నారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌, నిధుల కేటాయింపుతో పాటు 50 వేల ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న‌ను  మ‌ళ్లీ తెర‌మీద‌కు తెచ్చిన ఆయ‌న‌.. ఎలాగైనా ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలిచి ఈటెల రాజ‌కీయ జీవితానికి ముగింపు ప‌ల‌కాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే ఈటెల‌పై భూక‌బ్జా కోరు అనే ముద్రతో నైతికంగా దెబ్బ కొట్ట‌డంతో పాటు.. హుజూరాబాద్‌లో బీసీ, హైద‌రాబాద్‌లో రెడ్డి అని ఈటెల‌పై టీఆర్ఎస్ బీసీ నేత‌ల‌తోనే విమ‌ర్శ‌లు చేయిస్తున్నారు. మ‌రోవైపు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు కోసం కీల‌క నేత‌లంద‌రినీ మోహ‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసిన‌ట్ల స‌మాచారం. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి రాష్ట్రంలో కేసీఆర్‌ను ఎదిరించే వాళ్ల‌కు పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌నే విష‌యాన్ని చాటాల‌నే ఉద్దేశంతో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ర‌మ‌ణ‌ను పార్టీలోకి ఆహ్వానించ‌డం ద్వారా ఇటు ఈటెల వెళ్లిపోవ‌డంతో ఖాళీ అయిన బీసీ నేత స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డంతో పాటు అటు తెలంగాణ‌లో టీడీపీకి భ‌విష్య‌త్ లేకుండా చేసేందుకు కేసీఆర్ పూనుకున్నారు.

బండి సంజ‌య్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు అందుకున్న‌ప్ప‌టి నుంచి తెలంగాణ‌లో దూకుడు మీదున్న బీజేపీ జోరు కూడా క్ర‌మంగా త‌గ్గే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. బండి సంజ‌య్ దూకుడైన తీరుతో దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన బీజేపీ, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా పుంజుకుంది. అయితే అటు జాతీయ స్థాయిలో ప్ర‌ధాని మోదీ ప్ర‌భ క్ర‌మంగా త‌గ్గుతుండ‌డంలో ఇక్క‌డా రాష్ట్రంలోని ఆ పార్టీ జోరుకు బ్రేకులు ప‌డుతున్నాయ‌నే అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌ల‌మ‌వ‌డం, పెట్రోలు, డీజిల్‌తో పాటు నిత్య‌వ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేయ‌లేక‌పోతుండ‌డం, కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై మొండి ప‌ట్టుద‌ల‌తో ఉండ‌డం వంటి అంశాల కార‌ణంగా దేశంలో మోదీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇది రాష్ట్రంలో బీజేపీపై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. త‌న‌పై వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకోవ‌డానికి న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లెట్టిన మోదీ.. ఆ దిశ‌గానే ఇటీవ‌ల కేంద్ర మంత్రి వ‌ర్గంలో భారీ మార్పులు చేశారు. తెలంగాణ ఎంపీ కిష‌న్ రెడ్డికి కేబినేట్ మంత్రిగా ప్ర‌మోష‌న్ ఇవ్వ‌డం కూడా అందులో భాగ‌మేన‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

ఎన్నో రోజులుగా నాన్చి నాన్చి చివ‌ర‌కు టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ నిర్ణ‌యంతో రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుంద‌నే న‌మ్మ‌కం పెట్టుకుంది. అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్ర‌భుత్వంపై వివిధ విష‌యాల్లో ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే అధ్య‌క్షుడిగా అత‌ని ఎంపిక‌పై పార్టీ సీనియ‌ర్ నేత‌ల్లో అసంతృప్తి వ్య‌క్త‌మైంది.  రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించ‌గానే మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు సీనియ‌ర్లు వి.హ‌నుమంతురావు, కోమ‌టి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి లాంటి నాయ‌కులు బాహాటంగానే త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. చాలా మంది సీనియ‌ర్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సీనియ‌ర్ నాయ‌కులంద‌రినీ రేవంత్ ఎలా క‌లుపుకుని వెళ్తారో చూడాలి.
Tags:    

Similar News