టోల్ గేట్ ద‌గ్గ‌ర టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వీరంగం!

Update: 2017-12-12 09:01 GMT
ఉన్న‌ట్లుండి ఏమైంది? త‌మ అధికారానికి తిరుగులేద‌న్న‌ట్లుగా ఉన్న టీఆర్ ఎస్ పార్టీ ఇమేజ్ ను భారీగా దెబ్బ‌తీసేలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు చొప్పున టీఆర్ ఎస్ నేత‌లు వైఖ‌రి ఇప్పుడు వివాద‌స్ప‌దంగా మారింది. గ‌డిచిన మూడు రోజుల్లో నాలుగు ఉదంతాలు ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా ఉదంతం దెబ్బ‌కు.. టీఆర్ ఎస్ పార్టీలో ఇప్పుడు కొత్త చ‌ర్చ మొద‌లైంది.

ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఇలా.. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు వివాదాల్లో కూరుకుపోతున్న వైనంపై గులాబీ నేత‌లు తెగ మ‌ధ‌న‌ప‌డిపోతున్నారు. తాజా ఉదంతం కరీంన‌గ‌ర్ జిల్లాలోని రేణికుంట టోల్ గేట్ ద‌గ్గ‌ర చోటు చేసుకుంది. చొప్ప‌దండి ఎమ్మెల్యే.. టీఆర్ ఎస్ మ‌హిళా నేత బోడిగె శోభ‌.. ఆమె అనుచ‌రులు టోల్ ద‌గ్గ‌ర చిందులు వేసిన‌ట్లుగా చెబుతున్నారు.

టోల్ గేట్ ద‌గ్గ‌ర ఎమ్మెల్యే శోభ‌.. ఆమె అనుచ‌రుల వాహ‌నాల్ని అక్క‌డి సిబ్బంది ఆపారు. దీంతో.. ఎమ్మెల్యే శోభ‌కు కోపం వ‌చ్చింది. వీఐపీ వాహ‌నాల్ని ఎలా ఆపుతారంటూ మండిప‌డ్డారు. త‌మ‌ను వీఐపీగా గుర్తించ‌రా? అంటూ ప్ర‌శ్నించారు. దీనికి బ‌దులుగా టోల్ సిబ్బంది త‌మ ప‌ని తాము చేస్తున్నామంటూ స‌మాధానం ఇచ్చారు.

అధికారంలో ఉన్న ప‌వ‌ర్ ఫుల్ పార్టీకి చెందిన మ‌హిళా నేత‌ల‌పై ఇలా వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ ఆమె అనుచ‌రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.  ఎమ్మెల్యే శోభ‌.. ఆమె అనుచ‌రుల వ్య‌వ‌హారాన్ని టోల్ సిబ్బంది ఫోన్ లో వీడియో తీయ‌టంపై మ‌రింత ఆగ్ర‌హం చెందిన వారు.. వీడియో తీస్తున్న ఫోన్ల‌ను లాక్కుని వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచ‌రులు త‌మ‌పై దాడి చేసిన‌ట్లుగా టోల్ సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. వ‌రుస పెట్టి టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నేత‌ల వివాదాస్ప‌ద వైఖ‌రి ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.
Full View
 
Tags:    

Similar News