ఆనందయ్య మందుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

Update: 2021-05-28 03:30 GMT
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతహాగా డాక్టర్ అయిన సంజయ్ ఆ తర్వాత కేసీఆర్ కూతురు కవిత ప్రోత్సాహంతో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఆయన ఆనందయ్య ఆయుర్వేద మందుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాల నుంచి కొందరు కృష్ణపట్నం వెళ్లి మందు తీసుకొచ్చి నిన్న రాత్రి కళ్లల్లో వేశారని.. అది కళ్ల మంటకు కారణమైంది కానీ కరోనా ఏమాత్రం తగ్గలేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.

జగిత్యాల ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడారు. ఎమ్మెల్యేగా .. కంటి వైద్యుడిగా చెబుతున్నానని.. ఇంత శాస్త్రీయమైన వైద్యసదుపాయాలు, పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక కూడా ఈ నాటు పద్ధతులను ఇంకా ప్రజలు నమ్మడం దురదృష్టకరమని సంజయ్ కుమార్ అన్నారు.

కృష్ణపట్నం ఆనందయ్య మందు మంచిగా పనిచేస్తే జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న 45 మంది రోగులకు అదే మందు వేసి కరోనా తగ్గించేవాళ్లమన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. డాక్టర్లు, సిస్టర్స్ ఇతర సిబ్బంది ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఉండేది కదా అని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాటిని నమ్మకుండా ఇబ్బందులు పడవద్దని సూచించారు. శాస్త్రీయమైన పద్ధతులను పాటించాలన్నారు.
Tags:    

Similar News