జర్మన్ పాస్‌పోర్ట్‌పై ఎలా వెళ్లారు?: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ

Update: 2020-09-07 15:30 GMT
వేములవాడ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి నేత చెన్నమనేని రాజేశ్వర రావుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. పౌరసత్వ కేసులో చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనకు జర్మన్ పాస్‌పోర్ట్ ఉంది. అదే సమయంలో భారత పౌరుడిగా చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితరులు అమిత్ షాకు లేఖ రాశారు. ప్రభుత్వాన్ని మోసం చేశారనే కారణంతో నవంబర్ 20, 2019లో కేంద్రం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే చెన్నమనేని దీనిపై హైకోర్టును ఆశ్రయించి తాత్కాలిక ఊరట పొందారని గుర్తు చేశారు.

అయితే అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం చెన్నమనేని రమేష్ చెన్నై నుండి జర్మనీకి 2019 డిసెంబర్ మూడో వారంలో వెళ్లారని, ఆయన జర్మన్ పాస్‌పోర్ట్ పైనే వెళ్లారని చెప్పారు. మరో ఆసక్తికర విషయం ఏమంటే రమేష్ జర్మనీలో తన పాస్‌పోర్ట్ ఏప్రిల్ 2, 2013 వరకు చెల్లుతుందని హైకోర్టుకు తెలిపారని గుర్తు చేశారు.

కానీ ఆ తర్వాత జర్మన్ పాస్‌పోర్ట్ పైన వెళ్లారని, భారత ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు గాను రమేష్ పైన కేంద్రం ఏదైనా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించిందా అని తెలుసుకోగోరారు. అలాగే, తన జర్మన్ పౌరసత్వం పునరుద్ధరించబడిందని, చెన్నమనేని రమేష్ ఇంకా జర్మన్ పౌరసత్వం కలిగి ఉన్నారని జర్మనీ అధికారుల నుండి కేంద్రం ఏదైనా సమాచారం పొందిందా తెలియజేయాలని ఆ లేఖలో కోరారు. చెన్నమనేని రమేష్ పైన కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags:    

Similar News