కాల్పుల్లో మరణించిన రాకేష్ కు టీఆర్ఎస్ నీరాజనం.. బీజేపీపై ప్రతీకారమేనా?

Update: 2022-06-18 07:46 GMT
తెలంగాణ రాజకీయాల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తోంది అధికార టీఆర్ఎస్. ఇటీవల సోనియా, రాహుల్ పై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేసిన ఆందోళనలు లైట్ తీసుకొని రగిలించిన టీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడిని వదిలేసింది. దీంతో యువత రగిలించిన అగ్నికి కేంద్రం షేక్ అయ్యింది. అగ్నిపథ్ ఆందోళనలతో సికింద్రాబాద్ స్టేషన్ తగుల బడగా.. ఆ మంటల్లో చలికాచుకొని టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసింది. మంత్రి కేటీఆర్ ఏకంగా ట్వీట్ చేసి యువత ఆందోళనకు పరోక్ష మద్దతు ప్రకటించడం విశేషం.

ఇక సికింద్రాబాద్ ఆందోళనల్లో మరణించిన రాకేష్ అంతిమయాత్రను టీఆర్ఎస్ ఓన్ చేసుకుంది. దీన్ని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు,నాయకులంతా కలిసి అంతిమయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు.  వరంగల్ ఎంజీఎం మార్చురీ నుంచి నర్సంపేటకు భారీ జనసందోహం మధ్య డీసీఎంలో ర్యాలీగా మృతదేహాన్ని తరలిస్తున్నారు.

అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మృతదేహం తరలిస్తున్న వాహనానికి టీఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టడం చర్చనీయాంశంగా మారింది.

నేడు రాకేష్ మృతదేహానికి స్వగ్రామమైన నర్సంపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక రాకేష్ మృతదేహంతో పెద్ద ఎత్తున ర్యాలీకి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. రాకేష్ మృతిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏకంగా నియోజకవర్గం బంద్ కు పిలుపునిచ్చారు.

దీన్ని బట్టి కేంద్ర దళాలు, బీజేపీయే రాకేష్ మరణానికి కారణమని టీఆర్ఎస్ స్టాండ్ తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రాకేష్ కు సంతాపం తెలిపిన కేసీఆర్ అతడికి పరిహారం కూడా ప్రకటించారు. తెలంగాణ బిడ్డలను కడుపులో ెట్టుకుంటారని.. కేంద్ర సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వ అనాలోచిత, తప్పుడు, దుర్మార్గ విధానాలకు రాకేష్ బలయ్యారని ఆరోపించారు. కాల్పుల్లో బీసీ బిడ్డ బలి కావడం తనను తీవ్రంగా కలిచివేసిందని.. రాకేష్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. అతడి కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.  రైల్వే పోలీసు కాల్పుల్లో గాయపడ్డ వారికి గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

టీఆర్ఎస్ హంగామా చూస్తుంటే.. రాకేష్ ను కేంద్రమే చంపిందని.. దాన్ని ప్రజల్లోకి రాకేష్ అంత్యక్రియల ద్వారా తీసుకెళ్లాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అగ్నిపథ్ ఉద్యోగ నియామకాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని... కేంద్రం విధానాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రాకేష్ అంతిమయాత్రకు మంత్రులు పాల్గొనడం వెనుక కారణం అదేనంటున్నారు. ఎంత వీలైతే అంత బీజేపీపై వ్యతిరేకతను ప్రజల్లో పాదుకొలుపడమే ధ్యేయంగా టీఆర్ఎస్ ఈ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News