బీజేపీపై టీఆర్ఎస్ చార్జిషీట్‌.. నిప్పులు చెరిగిన కేటీఆర్‌

Update: 2022-10-29 10:50 GMT
మునుగోడు ఉప పోరు నేప‌థ్యంలో అధికార పార్టీ టీఆర్ ఎస్ దూకుడు పెంచింది. కేవ‌లం మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోనిస‌మ‌స్య‌లే కాకుండా.. రాష్ట్రం మొత్తంమీద కేంద్రంలోని బీజేపీ పాల‌కులు చూపుతున్న వివ‌క్ష‌ను మంత్రి కేటీఆర్ ఎత్తి చూపారు. చార్జిషీట్ రూపంలో వివిధ అంశాల‌ను లేవ‌నెత్తుతూ అటు బీజేపీపైనా ఇటు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపైనా ఆయ‌న విరుచుకుప‌డ్డారు.  ఈ ఛార్జ్‌షీట్‌లో నిర్దిష్టమైన ఆధారాలతో కూడిన ఆరోపణలు చేసినట్లు కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

''ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలో ఉన్న పార్టీ చేసిన పనులు చెప్పాలి. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు. దివాళాకోరు రాజకీయాలను మునుగోడు ప్రజలు హర్షించరు. మునుగోడులో అసాధారణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మేం ఏం చేశామో స్పష్టంగా చెప్పి ఓట్లు అడుగుతున్నాం. గెలిస్తే చేయబోయే పనులు కూడా చెబుతున్నాం. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మునుగోడును అనాథలా వదిలేశాడు. కేంద్రంలో ఉన్న బీజేపీ మునుగోడులో ఏం చేసింది? వ్యక్తిగత నిందారోపణలు చేస్తోంది. బీజేపీని డగట్టేందుకే ఛార్జ్‌షీట్‌ తీసుకొచ్చాం'' అన్నారు.

చార్జిషీట్‌లోని ముఖ్య అంశాలు..

+ జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరోసిస్‌ కేంద్రాన్ని పెడతానన్నారు. ఫ్లోరోసిస్‌ నిర్మూలన కోసం బీజేపీ ఏమీ చేయలేదు. ఫ్లోరోసిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయలేదు. ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్తులను అనాథలుగా చేసింది.

+ చేనేత, ఖాదీ ఉత్పత్తులపై పన్ను విధించిన మొట్టమొదటి ప్రధాని మోడీ.

+ మోటార్లకు మీటర్లు పెట్టాలనే దుర్మార్గపు కుట్ర చేసింది బీజేపీ, రాష్ట్రంలోని 30ల‌క్ష‌ల మంది రైతుల‌ను ద‌గా చేస్తున్నారు.  తెలంగాణను విద్యుత్‌ సమస్యల వలయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. రైతులు వాడే క‌రెంటుకు మీట‌ర్లు బిగించాల‌న్నారు.

+  మ‌హిళ‌లు వాడే సిలిండర్‌ ధర రూ.1100 దాటింది. పెట్రోలు ధర పెంపుతో దిగువ, మధ్యతరగతి, పేదల నడ్డి విరిచారు. ముడిచమురు ధర పెరగకపోయినా మోడీ చ‌మురు ధర పెంచేశారు. పెట్రో ధరల పెంపుతో ఉప్పు, పప్పులు, బియ్యం, నూనె ధరలు పెరిగాయి. పేదల సంక్షేమ పథకాలకు కోత పెట్టాలని బీజేపీ చూస్తోంది.

+ నల్లధనం విషయంలో తెల్ల ముఖం వేశారు. జన్‌ధన్‌ ఖాతాల విషయంలో మధ్య తరగతి కుటుంబాల తరఫున ఛార్జ్‌షీట్ వేస్తున్నాం అని కేటీఆర్‌ పేర్కొన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News