టీ ప్రభుత్వ ధీమా అదే...

Update: 2015-09-24 17:30 GMT
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ ప్రభుత్వం సై అంటోంది. ఒకరోజు కాదు.. రెండు రోజులు అయినా చర్చకు సిద్ధమేనని స్పష్టం చేస్తోంది. ప్రతిపక్షాలు గొడవ చేయకుండా చర్చిస్తే ఎన్ని రోజులు అయినా చర్చకు సిద్ధమని సాక్షాత్తూ కేసీఆరే ప్రకటించారు. అయితే, ప్రభుత్వం ఇంత సుస్పష్టంగా ప్రకటించడానికి కారణం లేకపోలేదని విశ్లేషకులు వివరిస్తున్నారు.

ఏడాదిన్నర కిందటి వరకు పదేళ్లపాటు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది. అంతకుముందు తొమ్మిదేళ్లపాటు టీడీపీ పాలించింది. అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేది కూడా ఈ రెండు పార్టీలే. మిగిలిన పార్టీలు అధికార పార్టీకి ఒక రకంగా భాగస్వామ్య పక్షాల్లాంటివే. అవి డిమాండ్ చేసినా పెద్ద ప్రయోజనం ఉండదు. ప్రతిపక్షాల్లోనూ కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా నిలదీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీలో గట్టిగా మాట్లాడే రేవంత్ రెడ్డిని అధికార పార్టీ మాట్లాడనివ్వదు. అసలు ఆయనను అసెంబ్లీలోకి అనుమతిస్తుందో లేదో అనుమానమే. ఇక మిగిలిన వాళ్లు గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఒకవేళ మాట్లాడిన.. మీరు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా.. అక్కడ మీరేం చేశారు? అసలు ఆత్మహత్యలు చంద్రబాబు పాపమేనని టీఆర్ ఎస్ నేతలు విరుచుకుపడే అవకాశం ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్ నేతలు. వాళ్లు నిలదీస్తే మొన్నటి వరకు అధికారంలో ఉన్నది మీరేనని, ఈ ఆత్మహత్యలు మీ పాపమేనని.. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయలేదని తప్పుపట్టడమే ధ్యేయంగా.. కాంగ్రెస్ పై ఎదురు దాడి చేయడమే ధ్యేయంగా చర్చకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చిన తాము ఈ ఆత్మహత్యలకు బాధ్యులం కాదని, అంతకు ముందు అధికారంలో ఉన్న మీరే బాధ్యులని నిలదీయనుంది. రైతు ఆత్మహత్యలపై మరెప్పుడూ మాట్లాడకుండా నిలదీయాలని భావిస్తోంది. మరి, దీనికి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Tags:    

Similar News