కాళేశ్వరంతో వారిని ఇరుకున పెడదాం!

Update: 2018-11-24 04:15 GMT
తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఓ కొత్త స్కెచ్ సిద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి - వారు జవాబు చెప్పలేని పరిస్థితిని కల్పించడం ద్వారా.. ప్రజల్లో ఆ పార్టీ చిత్తశుద్ధి మీద అనుమానాలు పుట్టించడానికి కొత్త ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. సోనియా మేడ్చల్ లో నిర్వహించన సభ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వబోతున్నట్లుగా విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో... ఆ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో తమకు అనుకూలంగా మార్చుకోవడం ఎలా అనే విషయంలో తెరాస నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

అలాగని ప్రత్యేకహోదా కు అడ్డం పడేలా వ్యాఖ్యలు చేయడానికీ వారికి అవకాశం లేదు. ఎందుకంటే.. అలాంటి మాటలు తెలంగాణలో స్థిరపడి ఉన్న సీమాంధ్రుల ఓటు బ్యాంకును  ప్రతికూలంగా మారుస్తాయి. అందుకే తెరాస నాయకులు ఆ జోలికి వెళ్లడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ నేతల్ని ఇరుకున పెట్టే మార్గాల్ని కూడా విస్మరించడం లేదు.

రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా అనే డిమాండు ప్రబలంగానే ఉంది. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు - పోలవరానికి జాతీయహోదాను కేంద్రం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు ప్రతిరూపాయీ తామే భరిస్తామని ప్రకటించింది. నిజానికి ఆరోజు నుంచి కూడా తెలంగాణలోనూ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలనే డిమాండ్ ఇక్కడి నాయకుల నుంచి ఉంది. తెరాస ఎంపీలు పలుమార్లు ఈ విషయమై కేంద్రానికి వినతులు కూడా సమర్పించారు. భాజపా నాయకులు కూడా పలు సందర్భాల్లో కాళేశ్వరానికి జాతీయహోదా సాధించుకు వస్తాం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు.

అయితే ఇప్పుడు సోనియా.. ఏపీకి ప్రత్యేకహోదా విషయాన్ని మరోమారు పునరుద్ఘాటించిన నేపథ్యంలో.. కాళేశ్వరం జాతీయహోదా అంశాన్ని తెరమీదకు తేవాలని గులాబీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. సోనియా సభలో ఏపీ పట్ల చిత్తశుద్ధి కనిపించింది... తెలంగాణ పట్ల కూడా చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మాలంటే.. కాళేశ్వరానికి జాతీయహోదా ప్రకటించాలి అని వారు డిమాండ్ చేయబోతున్నారు. కాళేశ్వరం రూపంలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారు మరి!
Tags:    

Similar News