వార‌సుల కోసం వీర‌లెవిల్లో పోరాటం.. తెలంగాణ నేత‌ల ఆశ‌లు ఫ‌లించేనా?

Update: 2022-04-16 02:52 GMT
రాజ‌కీయాల్లో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు పెట్టిందిపేరైన తెలంగాణ‌లో ఇప్పుడు ఇలాంటి రాజ‌కీయాలే మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చా యి. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కేసీఆరే.. త‌న కుమారుడు, కుమార్తెకు అవ‌కాశం ఇచ్చారు. అలాంట‌ప్పుడు.. మేం మా వాళ్ల‌ను తెస్తే.. త‌ప్పేంట‌ని కొంద‌రు నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ ఏడాదిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తమ వారిని రంగంలోకి దింపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇలాంటి వారి జాబితాలో ప్ర‌స్తుత స్పీక‌ర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ముందు వ‌ర‌సులో ఉన్నారు.

ఇప్ప‌టికే ప‌లువురు టీఆర్ ఎస్ నేత‌లు.. త‌మ వారిని రాజ‌కీయ రంగంలోకి దింపిన నేప‌థ్యంలో వీరు కూడా వార‌సుల‌ను పొలిటిక‌ల్ బ‌రిలో దించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాల్లోనే చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము పోటీ నుంచి త‌ప్పుకుని త‌మ వార‌సుల‌కు టికెట్లు ఇప్పించే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టార‌ని అంటున్నారు. ఇక‌, ఈ ఇద్ద‌రు నాయ‌కులు కూడా మాస్ నాయ‌కులుగా గుర్తింపు పొందారు. త‌మ త‌మ స్థాయిలో చ‌క్రాలు తిప్పిన వారే. గ‌తంలో కాంగ్రెస్‌లోఒక‌రు ప‌నిచేస్తే.. ఒక‌రు టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లోకి వ‌చ్చారు.

దీంతో రాజ‌కీయాల‌పై ప‌ట్టు ఉన్న నాయ‌కులుగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు చెందిన స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌.  పోచారం సుమారు నాలుగు ద‌శాబ్దాలుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉన్నారు. ప‌లుమార్లు మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 73 సంవత్సరాలు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలానూ తాను పోటీ చేసే ప‌రిస్థితి ఉంద‌ని భావిస్తున్న పోచారం..  తనయుడు భాస్కర్ రెడ్డిని రంగంలోకి దింపాల‌ని అనుకుంటున్నార‌ట‌.

ఇక‌,  బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డికి కూడా నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో మంచి పట్టుంది. అందుకే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయ‌న‌కు 66 ఏళ్లు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకుని త‌న కుమారుడు జ‌గ‌న్‌ను పోటీ చేయించాల‌ని భావిస్తున్నారు.

పోచారం భాస్క‌ర్‌రెడ్డి, బాజిరెడ్డి జగ‌న్ కూడా త‌మ తండ్రుల బాట‌లోనే సాగుతున్నారు. ఉమ్మ‌డి నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మ‌న్‌గా భాస్క‌ర్‌రెడ్డి కొన‌సాగుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల నేత‌గా ఉన్నారు. త‌న తండ్రి పోచారం లాగే ఆయ‌న కూడా డీసీసీఐ ఛైర్మ‌న్‌గా రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లెట్టారు.

ఇక బాజిరెడ్డి  జ‌గ‌న్ కూడా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న కోసం కొన్నేళ్లుగా తండ్రితో క‌లిసి ఆయ‌న సాగుతున్నారు. ప్ర‌జా క్షేత్రంలో విస్త్రతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ధ‌ర్ప‌ల్లి జ‌డ్పీటీసీగా ఉన్న ఆయ‌న బాజిరెడ్డి వార‌సత్వాన్ని కొన‌సాగించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోచారం, బాజిరెడ్డి పోటీ నుంచి త‌ప్పుకుని త‌మ త‌న‌యుల‌ను నిల‌బెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి దీనికి కేసీఆర్ అనుమ‌తిస్తారా?  ఇలా చేస్తే.. మ‌రింత మంది వార‌సుల‌కు అవ‌కాశం ఇవ్వాల్సి ఉంటుంద‌ని భావిస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే.. ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌ను కుటుంబ పార్టీగా ముద్ర వేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఆచితూచి అడుగులు వేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News