హుజూర్‌ న‌గ‌ర్‌ లో ఆ పార్టీ ఆశ‌లు వ‌దులుకుందా..?

Update: 2019-10-11 14:30 GMT
హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపుపై అధికార టీఆర్ ఎస్ పార్టీ ఆశ‌లు వ‌దులుకుందా..? ఆ పార్టీ అగ్ర‌నేత‌లు రోడ్డు షోలు నిర్వ‌హించ‌క‌పోవ‌డమే ఇందుకు నిద‌ర్శ‌న‌మా..? ఆర్టీసీ ఉధృతం కావ‌డ‌మే ఇందుకు కార‌ణామా..? అంటే.. తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. నిజానికి.. హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను అధికార టీఆర్ ఎస్ పార్టీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని.. త‌మ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో తిరుగులేని మ‌ద్ద‌తు ఉంద‌ని బ‌లంగా చెప్పాల‌ని అనుకుంది.

ఇదే ఊపులో ఉప ఎన్నిక‌కు షెడ్యూల్‌ విడుద‌ల కావ‌డ‌మే ఆల‌స్యం.. పార్టీ అభ్య‌ర్థిగా శానంపూడి సైదిరెడ్డిని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. గులాబీ నేత‌లు కూడా ఫుల్ జోష్‌ లో క‌నిపించారు. కానీ.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మెతో ప‌రిస్థితుల్లో వేగంగా మార్పులు వ‌చ్చాయి. అభ్యర్థిని ప్రకటించిన మొద‌ట్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. 2018లో ముంద‌స్తు ఎన్నిక‌ల్లో హుజూర్‌ న‌గ‌ర్‌ లో టీపీసీసీ నేత ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డి టీఆర్ ఎస్ అభ్య‌ర్థి శానంపూడి సైదిరెడ్డిపై స్వ‌ల్ప‌మెజార్టీతో విజ‌యం సాధించారు.

ఆ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌ కు కేవ‌లం 7 వేల ఓట్ల మెజార్టీయే వ‌చ్చింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డి న‌ల్ల‌గొండ ఎంపీగా గెల‌వ‌డంతో హుజూర్‌ న‌గ‌ర్ స్థానం ఖాళీ అయింది. అయితే..ఈ ఉప ఎన్నిక‌లో కూడా సైదిరెడ్డికే సీఎం కేసీఆర్ మ‌ళ్లీ టికెట్ ఇచ్చారు. సానుభూతి ప‌ని చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. నిజానికి.. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్‌ న‌గర్ లో గతంలో టీఆర్ ఎస్ ఎప్పుడూ గెల‌వ‌లేదు. కానీ.. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుస్తామని మొదట్లో ఆశలు పెట్టుకుంది.

అయితే.. భారీగా పార్టీ నాయకులను టీఆర్ ఎస్ అగ్రనేతలు రంగంలోకి దింపారు. మొత్తం 80 మంది ఇన్ చార్జ్‌ ల‌ను  నియమించారు. ఆ ఇన్ చార్జ్‌ ల‌కు ఊరూరా అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. ఇలా ఫుల్‌ జోష్‌ తో జ‌నంలోకి వెళ్లారు. టీఆర్ ఎస్ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అయితే.. అనూహ్యంగా ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ సర్పంచ్‌ లు మూకుమ్మడి నామినేషన్లకు సిద్ధమవ‌డం ఆ పార్టీని కాస్త ఆందోళనకు గురిచేసింది. ఆ త‌ర్వాత ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ప్రారంభ‌మైంది. ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీంతో నాయ‌కుల్లోనూ జోష్ త‌గ్గిపోయింది.

ఈ నెల 4న పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్డు షో నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత ఆయ‌న రోడ్డు షో లు ర‌ద్దు కావ‌డంతో గులాబీ శ్రేణుల్లో జోష్ త‌గ్గిపోయింది. ఈనెల 19న ప్ర‌చారం ముగుస్తుంది. స‌మ‌యం కూడా లేక‌పోవ‌డం.. పార్టీ అగ్ర‌నేత‌లు నియోజ‌క‌వ‌ర్గానికి రాక‌పోవ‌డంతో.. గెలుపుపై పార్టీ శ్రేణులు ఆశ‌లు వ‌దులుకున్నాయ‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది.  ఈ ప్ర‌తికూల ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యూహం ర‌చిస్తారో ? చూడాలి మ‌రి.



Tags:    

Similar News