కేసీఆర్‌ ను వెనక్కు లాగుతున్న సీనియర్లు

Update: 2017-09-19 05:39 GMT
ఉప ఎన్నికలకు వెళ్లి సత్తా చాటి 2019 ఎన్నికల కోసం సిద్ధమవ్వాలని వ్యూహాలు రచిస్తున్న తెలంగాణ సీఎం - తెరాస అధినేత కేసీఆర్ కు సొంత పార్టీలోని సీనియర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రివర్గంలోని ఇద్దరు సీనియర్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
    
నిజానికి ఉప ఎన్నికలు ఎక్కడ రావాలి... దాంతో ఎలాంటి ప్రయోజనం పొందాలి అన్న విషయలో కేసీఆర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. నల్గొండ ఎంపీగా ఉన్న ఫిరాయింపు నేత గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి అక్కడ మళ్లీ ఉప ఎన్నికల్లో సత్తా చాటి ఆ ప్రాంతంలో బలంగా ఉన్న కాంగ్రెస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలన్నది కేసీఆర్ ప్లాన్. అలాగే... పాత మహబూబ్‌ నగర్‌ జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం రామ్మోహన్‌ రెడ్డితో కూడా రాజీనామా చేయించి అక్కడా సత్తా చాటాలన్నది ప్రణాళిక. ఇందుకు గాను ఆ ఇద్దరు నేతలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు రాజకీయవర్గాల్లో, టీఆరెస్ లో చెప్పుకొంటున్నారు.
    
అయితే... కేసీఆర్ ఆలోచనలను కొందరు పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారట. ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లడం వేరని... ప్రస్తుతం అధికారంలో ఉండి ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లడం వేరని వారు కేసీఆర్ కు సూచించినట్లుగా తెలుస్తోంది.  మరోవైపు కేసీఆర్ మాత్రం తన నిర్ణయాన్ని అమలు చేయడానికే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రాజీనామాలపై దసరా తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
    
ఇప్పటికే నల్గొండ లోక్‌ సభ - మక్తల్‌ అసెంబ్లి నియోజకవర్గాల్లో కేసీఆర్ సర్వే జరిపించారని ఇందులో సానుకూల ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. నిఘా వర్గాల ద్వారా కూడా నివేదిక తెప్పించారని రెండు ఫలితాలు ఒకేవిధంగా వచ్చాయని తెలుస్తోంది.
Tags:    

Similar News